Monday 21 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 258 వ భాగం



మార్కండేయ సంహితలోనూ, ఆనందగిరీయంలోనూ సౌందర్యలహరి యని పేర్కొనబడకుండా సౌందర్య సారమని, అంబికాస్తవసారం అని చెప్పడం వల్ల ఈ కథకు బలం చేకూరింది. ఇది వాడుకలో నున్న కథ.


మొదటి భాగం అంతా మంత్రశాస్త్రమయం. నందికేశ్వరుడు కొంత దానిని తీసుకొని పోవడానికి విని సంతోషిస్తున్నాను. వీరు పూరించిన భాగం, కవిత్వంతో, భక్తితో, ఆమె సుందర రూపాన్ని వర్ణించడంలో దీనికి సాటివచ్చే గ్రంథం మరొకటి కనబడదు. వీరి గొప్పదనం లోకానికి ఇట్లా వెల్లడైనందులకు సంతోషం.


పరమేశ్వరుని అజ్ఞానుసారం శంకరులు శృంగేరిలో, కేదారంలో, నీల కంఠంలో, కంచిలో నాల్గు లింగాలను స్థాపించారు. ఇక సిద్ధి పొందుతున్నారనగా మోక్ష లింగాన్ని సురేశ్వరులకు చిదంబరంలో ప్రతిష్ఠించ వలసిందిగా ఇచ్చారట. ఈ మాట ఆనందగిరీయంలో ఉంది.

కంచి యొక్క ఘనత


దిగ్విజయ యాత్రయైన వెనుక చివరగా కాంచీపురానికి వచ్చారు. ఈ నగరం, ప్రాచీన సాహిత్యంలోనే పేర్కొనబడింది. ఇది ఒక గొప్ప విద్యాకేంద్రం. దేశం నలుమూలలనుండీ విద్యార్థులు వచ్చేవారు.


ఈ విద్యాకేంద్రానికే మరో పేరు ఘటికాస్థానం. సంస్కృత విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. తమిళ గ్రంథమైన మణిమేఖలైలో అనేక మతనాయకులిందుండే వారని చెప్పబడింది. చరిత్ర పునరావృతం అవుతుందని అన్నట్లుగా శంకరుల కాలంలో జైన బౌద్ధాలు అస్తమించినా అవి తరువాతి కాలంలో తల ఎత్తినట్లు మత్తవిలాస ప్రహసనంలో కంచిలోని జైన బౌద్ధాల ప్రస్తావన ఉంది. ఇప్పటికీ బుద్ధ శిల్ప సంపద కంచిలో గోచరిస్తుంది. కంచిలో కొంత భాగానికి జినకంచియని పేరు.


No comments:

Post a Comment