Tuesday 22 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 259 వ భాగం



ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు - ఈ ముగ్గుర్నీ రత్నత్రయం అంటారు. వీరికి చెందిన దేవాలయాలు, ఇక్కడ ప్రసిద్ధిని పొందాయి. ఏకామ్రనాథుని ఆలయంలో పరమేశ్వరుని పృథ్వీలింగం ఉంది. కామకోష్టం, అమ్మవారికి చెందింది. విష్ణు కంచిలో వరదరాజ స్వామి యున్నాడు. వైష్ణవుల దివ్యదేశాలలో ఇది యొకటి. శ్రీరంగం, తిరుపతి తరువాత ఈ ఆలయాన్ని వైష్ణవులు తప్పక దర్శిస్తారు.


ఆనాడు విష్ణు కంచిని చిన్న కంచియని; శివకంచిని పెద్ద కంచియని అనేవారు. ఇవే కాకుండా షణ్మత మూర్తులున్నాయి. కంచిలో వినాయకుని ఆలయం ఉంది. కొంత ప్రాంతాన్ని పిళ్ళైయార్ పాలయం అంటారు. కామాక్షి ఆలయంలో ఆరేడు వినాయక మూర్తులున్నాయి. కంచి పృధ్వీక్షేత్రం, గణపతి, పృథ్వీ తత్వానికి చెందినవాడు.


ఇక్కడ కుమార కొట్టంగా పిలువబడే ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. తమిళంలో స్కంద పురాణాన్ని వ్రాసింది ఇక్కడే అని అంటారు. విశిష్టత ఏమిటంటే ఈశ్వరాలయం, అమ్మవారి ఆలయం మధ్యలో కుమారస్వామి ఆలయం ఉంది.


కంచిలో కచ్ఛపేశ్వరాలయంలో సూర్యాలయం ఉంది. ఇందే మయూరుడు వ్రాసిన మయూర శతకం, గోడలపై చెక్కబడింది. కనుక ఇది సూర్యక్షేత్రం కూడా.


ఇట్లా షణ్మతాలకు నిలయంగా కంచి ప్రసిద్ధి పొందింది. షణ్మతాలకు శంకరులకు ముందే ప్రసిద్ధి యుండడం వల్ల ఇక్కడికి చివరి రోజులలో శంకరులు వచ్చారు. లేదా షణ్మత స్థాపనాచార్యులైన తరువాత ఇది ప్రసిద్ధిని పొంది యుండవచ్చు. సప్తమోక్షపురులలో ఇది యొకటని చెప్పాను కదా! ఇట్లా మతంలో, విద్యలో, రాజకీయాలలో వర్తక వాణిజ్యాలలో ప్రసిద్ధిని పొందడం వల్ల 'నగరేషు కాంచీ' అన్నారు.


No comments:

Post a Comment