ఒకే ఒక పరమాత్మ, నానా రూపాలను ధరిస్తున్నాడని, దానిని గుర్తించినవాడు సర్వజ్ఞుడౌతాడు. శంకరులీ అర్ధంలోనే కాదు. ఒకటి నుండే అనేక శాస్త్రాలు ఆవిర్భవించాయి. అన్ని శాస్త్రాలను అవలోకనం చేసినవాడు. సర్వజ్ఞుడౌతాడు కదా! అతడే సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కడానికి అర్హుడు.
ఏదైనా పని చేయాలన్న ఇదేమైనా బ్రహ్మవిద్యా అని అంటాం. అట్టి బ్రహ్మ విద్యలోనూ వీరు పారంగతులే. సర్వజ్ఞ పీఠం ఎక్కేటప్పుడు దాని క్రింద అనేకమైన మెట్లుంటాయి. ఒక్కొక్క మెట్టెక్కినపుడు ఒక్కొక్క విద్యలో, నిష్ణాతుడు ప్రశ్నిస్తాడు. వానికి సమాధానం చెప్పి పై మెట్టునెక్కాలి. చివరగా, సరస్వతియే ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పగలిగితే సింహాసనం మీద కూర్చుండడానికి అర్హత వస్తుంది. అట్లా ఎక్కగలిగారు.
వారి వాఙ్మయాన్ని పరిశీలిస్తే అనేక శాస్త్రాలలో పారంగతులైనట్లు తెలుస్తుంది. జ్యోతిశ్శాస్త్రంపై శంకరాచార్యం అనే పేరుతో పుస్తకమొకటుంది. ఒక సంగీత శాస్త్రజ్ఞుడు వచ్చి సంగీత శాస్త్రంలో గతి - గమనం గీతం అనే - మాటలు వస్తాయని వాటి సాంకేతిక విషయాలు మాకే తెలియవని అన్నపుడు శంకరులు 'గళే రేఖాః త్రిసా అనే శ్లోకంలో సంగీత శాస్త్ర విషయాలను ముచ్చటించారని ఆశ్చర్య పడ్డాడు.
అంతేకాదు, కొబ్బరి చెట్టును వంచడమనే విద్యను నేర్చుకొన్నారని చెప్పాను. అట్లే చెప్పులు కుట్టేవాని విద్య గురించి చెప్పినట్లు లోగడ ఉపన్యాసాలలో చెప్పాను.
రామునకు పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యాన్ని పాలించాడు కాని శంకరులు అన్ని పనులూ నిర్వర్తించిన తరువాత వీరికి పీఠారోహణ ఉత్సవం జరిగింది. అనగా జ్ఞాన రాజ్యానికి తుది అంకం. శంకరాభ్యుదయం ఇట్లా చెప్పింది.
'కంపాతీరనివాసినీం అనుదినం కామేశ్వరీం అర్చయన్
బ్రహ్మానందమవిందత త్రిజగతాం క్షేమం కరో శంకరః'
No comments:
Post a Comment