Thursday 3 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 240 వ భాగం



కంచిలో, కామాక్షి ఉగ్రంగా ఉంటే ఆమె ముందు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి చల్లని తల్లిగా చూపించారు. ఆమెకు సాహాయ్యంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది శక్తులుండగా వారిని శ్రీచక్రంలో నియంత్రించారు. అందుకే ఉగ్రరూపంలో ఉన్న ఉత్సవ మూర్తిని ఊరేగించినపుడు ఒక నిముషం శంకరులు సన్నిధిలో వారి అనుమతి తీసుకున్నట్లుగా ఉంచి మరల కదులుస్తారు.


జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి కూడా ఉగ్రంగా ఉంటే ఆ ఉగ్రకళను తాటంకంలో బంధించి వాటిని రెండు చెవులకు ఆభరణాలుగా చేసియుంచారు. అట్లాగే కొల్లూరులోని మూకాంబికకు, అస్సాంలోని కామాఖ్యకు కూడా.


తిరువెట్రియూర్ లో (చెన్నై) కూడా అమ్మవారిని త్రిపురసుందరిగా చూపించారు. ఆ ఉగ్రకళను ఒక నూతిలో బంధించారు. సంవత్సరానికి ఒకరోజున ఆ మూర్తికి పూజ కూడా ఏర్పాటు చేయించారు.


ఎక్కడ ఇట్లా చేసినా అక్కడ వైదికమైన అర్చనా పద్ధతినే ప్రవేశపెట్టారు. అక్కడ ఆగమ విధానానికి ప్రాధాన్యం కాక వైదికమైన పద్ధతే ఉంటుంది. ఆది శైవులు (గురుక్కుల్) వారు, స్మార్త బ్రాహ్మణులే ఆర్చకులుగా ఉంటారు.


ఆచారాలను పాటించడంలో నంబూద్రీలు నిష్ణాతులు. వీరిని చాలాచోట్ల అర్చకులుగా నియమించారు. తిరువోట్రియూర్, బదరిలోని అర్చకులు కేరళలోని నంబూద్రి బ్రాహ్మణులే. బదరిలోనున్నవానిని 'రావల్' అని గౌరవసూచికంగా పిలిచి రాచమర్యాద చేస్తారు.


కొన్నిచోట్ల దేవాలయ పునరుద్ధరణలు చేసారు. గురువాయూర్లో శంకరులేర్పాటు చేసిన పూజా పద్ధతియే నేటికీ ఉంది.


No comments:

Post a Comment