Thursday 17 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 254 వ భాగం



అక్కడే శంకరుడు ఐదు స్ఫటికలింగాలనిచ్చాడు. ఈ మాట శివ రహస్యంలో, మార్కండేయ సంహితలోనూ ఉంది. కాశీలో ఇచ్చినట్లు శివరహస్యం చెప్పింది. వీటిని కైలాస లింగాలని అంటారు. ఇవి యోగలింగం, భోగలింగం, వీరలింగం, ముక్తి లింగం, మోక్ష లింగాలు. యోగలింగాన్ని కంచిలో, భోగలింగాన్ని శృంగేరీ మఠంలో; వరలింగాన్ని నేపాల్లోని నీలకంఠ క్షేత్రంలో; ముక్తి లింగాన్ని కేదారంలో; మోక్షలింగాన్ని చిదంబరంలో ప్రతిష్ఠించారు. ఇవి అన్నీ స్ఫటిక లింగాలే.


శివపూజా సమయంలో మనం, ఈ దిగువ శ్లోకాన్ని పఠిస్తాం:


ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావి స్ఫురత్

జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః 

అస్తో కాపుత మేక మీ శమనిశం రుద్రానువాకాన్ జపన్ 

ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో భిషించేచ్ఛివం


ముందు భాగంలో ఎట్లా శివుణ్ణి ధ్యానం చేయాలో చెప్పింది. స్వామిని అంతటా వ్యాపించిన జ్యోతి స్వరూపునిగా ధ్యానించాలి. స్ఫటిక లింగంగా ఉన్నట్లు భావించాలి. అతని నెత్తిపై పూర్ణ చంద్రుడున్నట్లు ధ్యానించాలి. ఆకారం లేని మూర్తిపై పూర్ణచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆకారం ఉన్న మూర్తిపై తదియనాటి చంద్రుడుంటాడు. అందుకే వాటిని చంద్రమౌళీశ్వర లింగాలని అంటారు.


పూర్ణచంద్రుని నుండి అమృత స్రావం - ఆప్లుతం, అనగా దానిచే అభిషేకింపబడ్డాడు. అందుకే అతనికి అభిషేకం చేస్తాం. ఒక్క చుక్క వేసినా సంతోషిస్తాడు.


No comments:

Post a Comment