పై సిద్ధాంతాలలో ఒకటి జ్ఞానానికి, ఒకటి ప్రేమకు, ఒకటి కర్మకు ప్రాధాన్యం ఈయగా అద్వైతాన్ని శాంతమందామా? ఇది మామూలుగా మనమనుకునే శాంతి కాదు. అద్వైత శాంత స్థితిలో ప్రేమ, క్రియలు, అన్నీ సంపూర్ణ వికాసంతో, శక్తితో ఉంటాయి. అందుకే శంకరులు సర్వజ్ఞులై అందరిపట్ల ప్రేమను చూపిస్తూ నిరంతరం కార్యమగ్నులైనట్లుంటారు.
బ్రహ్మము అసత్యమని, జగత్తు సత్యమని చార్వాకం చెప్పగా, ఈ రెండు అసత్యములని బౌద్ధం చెప్పింది. బ్రహ్మము, జగత్తు సత్యమని న్యాయశాస్త్రం అంటోంది. జగత్తు అసత్యమని, అది ప్రకృతివల్ల ఏర్పడిందని బ్రహ్మము అనగా పురుషుడే సత్యమని సాంఖ్యంచెప్పింది.
అయితే అద్వైతం మాటేమిటి? సామాజిక, రాజకీయ, మత విశ్వాసాలను తెలిపే నామవాచకాల చివర చేర్చు పదభాగం వంటిది కాదు. అనగా సోషలిజం, బుద్ధీజమ్ వంటిది కాదు. దీనిని Non-dualism అన్నా సంపూర్ణార్ధాన్ని ఈయదు.
బ్రహ్మమే సత్యమని, జగత్తు మిథ్యయని అనగా అసత్యమని చెబుతుంది. అయితే అంతా అసత్యమా? కాదు. జగత్తు అసత్యమైనా జ్ఞానం కలిగేటంత వరకూ సత్యంగానే కన్పిస్తుంది. ఆ మాట గుర్తించండి. అంటే జగత్తు కనుమరుగు కాదు. అసత్యమైనదిగానే జ్ఞాని భావిస్తాడు. అంతేకాదు, సమదృష్టితో జగత్తును సత్యమైన బ్రహ్మముగా చూస్తారు. బ్రహ్మమే సత్యమని; జగత్తును బ్రహ్మ సత్యమని చూస్తాడు.
No comments:
Post a Comment