Sunday 2 June 2024

శ్రీ గరుడ పురాణము (193)

 


హే భగవాన్! గదాధర విష్ణుదేవా! నేను పితృకార్యాలను సంపన్నం చేయడానికై గయాతీర్థాలకు వచ్చియున్నాను. నా ద్వారా జరిగిన ఈ కర్మలన్నిటికీ తమరే సాక్షి. మీ దయవల్ల నేను దేవ, గురు, పితృ అను మూడు రకాల ఋణాల నుండీ నేటితో విముక్తుడనైనాను'


(అధ్యాయం - 85)


ఆదిగదాధర మాహాత్మ్యం


గయలో మరికొన్ని తీర్థాలనూ వాటి మహిమలనూ వినిపిస్తాను. ఈ గయా తీర్ధంలో ప్రేతశిలగా విఖ్యాతమైన క్షేత్రం ప్రభాస, ప్రేతకుండ, గయాసుర శీర్ష నామకములైన తీర్థాలతో విరాజిల్లుతోంది. ఈ శిల సర్వదేవమయి. దీనిని సవ్యంగా యమధర్మరాజే ఐశ్వర్య ప్రాప్తి కోసం ధరించాడని విన్నాను. మానవుని మిత్ర, బంధు, బాంధవులలో నెవరికైనా ప్రేతయోని ప్రాప్తిస్తే అతడు ఈ ప్రేతశిలలో కర్మకాండ జరిపితే వారికీ అతనికీ కూడా గొప్ప శుభాలు కలుగుతాయి. ఇక పితృజనులకిది మరింత శుభదాయకం. అందుకే మునులు, రాజులు, రాజపత్నులు మున్నగు వారిచటకు వచ్చి శ్రాద్ధాది కర్మలను నిర్వహించి బ్రహ్మలోకానికి తమ పితరులను పంపించగలుగుతారు. తామూ దేహాంతంలో బ్రహ్మ లోకాన్ని చేరుకుంటారు. 


గయాసుర మండపానికి వెనుక నున్న శిలకు ముండపృష్ఠగిరి అని పేరు. ఇది సర్వదేవమయం. దీని పాద ప్రాంతంలో బ్రహ్మసరోవరాది అనేక తీర్థాలున్నాయి. వాటిలో అరవిందవనమను తీర్థమొకటి. దాని వలన ఆ పర్వతంలో నొక ప్రాంతానికి అరవింద గిరి అనే నామమేర్పడింది. అక్కడ క్రౌంచ పక్షుల పాదాల గుర్తులుంటాయి. ఆ పర్వతభాగాన్ని క్రౌంచ పాదగిరి అంటారు. శ్రాద్ధాది కర్మల ద్వారా పితరులకు బ్రహ్మలోకం ప్రాప్తింపజేసే ప్రాంతమిది.


ఆదికాలమునుండే విష్ణుభగవానుడిక్కడ అవ్యక్త రూపంలోనూ, గదాధర శిలరూపం లోనూ నెలకొనివున్నాడు. అందుచే ఈ శిల సర్వదేవమయమని చెప్పబడుతోంది. మత్స్య కూర్మాది విష్ణువు అవతార రూపాలకున్న ప్రాశస్త్యమే ఇక్కడి గదాధర రూపానికి వుంది. ఆదికాలం నుండే గదాధరరూపుడైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల పూజలందు కొంటున్నాడు. కాబట్టి మానవులంతా ఇక్కడికి వచ్చి, ఆగి, అర్ఘ్య, పాద్య, పుష్పాదిక ఉపహారాలతో ఆ స్వామిని పూజించాలి. ఈ తీర్థంలో గదాధరునీ, ఇతరదేవులనీ పూజించి సర్వోపచారాలనూ సమర్పించి ముకుట, వస్త్ర, ఘంట, చామర, దర్పణ, అలంకారాలను తీర్థానికి సమకూర్చి పెట్టి పిండ, అన్నదానాలను కూడా చేసినవానికి తాను జీవించి యున్నంత కాలమూ ధన, ధాన్య, ఆరోగ్య, ఐశ్వర్య, పుత్ర పౌత్ర లాభాలు అక్షయంగా వుంటాయి. ఆయువు పెరుగుతుంది. శ్రేయ, విద్య, అర్ధ, అభీష్ట కామనల సాకారతలలో లోటుండదు. దేహాంతంలో భార్యాసమేతంగా స్వర్గాన్ని చేరుకుంటాడు. మరుజన్మలో రాజ్యసుఖాన్నీ, శత్రుసంహారక పరాక్రమాన్నీ, జయపరంపరనీ పొంది కూడ వధ, బంధనాదుల నుండి ముక్తుడై చివరలో మోక్షానొందుతాడు. ఇక్కడ పిండం పెట్టినవారికీ అందుకున్నవారికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.


వధ బంధ వినిర్ముక్తశ్చాంతే 

మోక్షమవాప్నుయాత్ |

శ్రాద్ధ పిండాది కర్తారః

పితృర్భిః బ్రహ్మలోకగాః ॥


(ఆచార...86/17)


No comments:

Post a Comment