Monday 10 June 2024

శ్రీ గరుడ పురాణము (201)

 


ఈ స్తోత్ర భావంలో పితృదేవతల మాహాత్మ్యాన్ని తెలిపే విశేషాలు చాలానే కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వధామంత్రాల' ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ వుండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తి పరుస్తారు. వారి భుక్తి ముక్తి కామనలను పితృ దేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తి పఱుస్తారు. అలాగే గుహ్యకాదులు కూడా. పృథ్విపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు.


తపస్సు చేసుకుంటూ నిర్ధూతకల్మషులై, సంయతాహారులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధకర్మలను చేసి వీరిని ప్రసన్నులను చేసుకుంటారు. నైష్ఠిక బ్రహ్మచారులూ, ధర్మాచారులూ, జితేంద్రియులూ కూడ వీరిని అపర కర్మల ద్వారా పూజించి ధన్యులౌతారు. పృథ్విపై గల నాలుగు వర్ణాల వారూ వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులనందుకోగలుగుతున్నారు.


పాతాళంలో వుండే రాక్షసులు సైతం తమ దంభాహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండప్రదానం చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగాది జాతుల వారూ అలాగే చేస్తారు. దేవతలూ అంతే.


పరార్థం కోసం, అనగా ఇతరులకుపయోగపడడం కోసం, పితృయోనిలో వుండి కూడా, అమృతరూపులై విమానాల్లో ప్రయాణిస్తూ, నిర్మల మనస్సుతో, కష్టాల పాలైన యోగులకు, వాటి నుండీ, వారు కోరుకుంటే జీవితం నుండీ కూడా ముక్తిని ప్రసాదిస్తూ వుంటారు పితృదేవతలు. దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ, స్వధాభోజులై తమ పుణ్యఫలాన్నొక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించేవారికి పితృదేవతలు ఈప్సితార్థ సిద్ధిని కలిగిస్తుంటారు. ఏ కోరికాలేని వారికి కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యం కూడ వారికి వుంటుంది.


అగ్నిలో వ్రేల్చిన హవిష్యాహుతులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నానని ఇంకా అనేక విధాలుగా పితృ దేవతల మాహాౄత్మ్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతి కొనసాగింది.


No comments:

Post a Comment