Saturday 8 June 2024

శ్రీ గరుడ పురాణము (199)

 


'నాయనా! నీవు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు; సార్వజనీనమూ కాదు. లోక కళ్యాణకారకమూ కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవీ, ప్రారబ్ధకర్మఫలాలూ వుంటాయి. వాటిని బట్టి జన్మబంధా లేర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే.

 

ప్రారబ్ద పాప పుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పిన విద్వజ్జనప్రవచిత ఆత్మ ప్రక్షాళనం సుఖదుఃఖ అనుభవముల ద్వారా జరిగిపోతుంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో వుండి కూడా ఆత్మను రక్షించుకోగలవు' అన్నారు పితరులు.

 

'హే పితృదేవతలారా! కర్మమార్గం ద్వారా అవిద్యా మాయా బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా! మీరంతా నన్ను మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు' అన్నాడు రుచి.

 

'నాయనా! కర్మ ద్వారా ఆవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కాని విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా! మాయను, ఆవిద్యనూ విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా! సజ్జనులెపుడూ శాస్త్ర ప్రతిపాదితములైన విహిత కర్మలను ఉల్లంఘించరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను -వారు చేయాలి. అలా చేయని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహం ఆత్య ప్రక్షాళన హేతునే కాని అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యం. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెనూ ఉద్దరించి, నీవూ ఉద్ధరింపబడుతున్నావు కదా! వంశాన్ని అభివృద్ధి పరిచి, యజ్ఞయాగాదులను చేసి, దానధర్మాలను నిర్వర్తించిన వాడే విజమైన మనిషి. వానికి నిజమైన తోడు, నీడ స్త్రీయే. నువ్వు వివాహం చేసుకోక, వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు.

 

అవిద్య విషంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పారు కదా? కాని విషం కూడా మానవునికెన్నో విధాల ఉపయోగపడుతోంది కదా! కొండొకచో ప్రాణరక్షణ కూడా చేస్తున్నది. కాబట్టి కర్మల వల్ల ఆవిద్య, మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి పెళ్ళి చేసుకో. గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు' అని బోధ పఱచారు పితృదేవులు.


No comments:

Post a Comment