తరువాతి కథను మార్కండేయ మహాముని ఇలా చెప్పాడు. పితృదేవతల కృప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రంలోచ అను పేరు గల అప్సర ఆవిర్భవించింది. మనస్సుకి ప్రీతిని కలిగించే అందంతో బాటు అన్ని శుభలక్షణాలూగల వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. ప్రంలోచ ఆతనితో 'హే తపస్విశ్రేష్ఠా! నేనొక అచ్చరను. వరుణపుత్రుడూ, మహాత్ముడునైన పుష్కరుని ద్వారా నాకీ అతిశయ సుందరియైన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అను పేరు గల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు' అని చెప్పింది.
'అలాగే' అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక యింటి వాడయినాడు. వారి పుత్రుడే పదమూడవ మనువు రౌచ్యుడు' అని చెప్పి మార్కండేయ ముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి వీడ్కొలిపాడు"
(అధ్యాయాలు - 89,90)
విష్ణు భగవానుని అమృత ధ్యానస్వరూపం
“శౌనకాది మహామునులారా! స్వాయంభువ మనువాదిగా ఎందరో మహామునులు నిరంతరం, వ్రత, యమ, నియమ, పూజా, స్తుతి, జపసహితంగా నిరతులైవుండి శ్రీహరిని ధ్యానిస్తుంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు, దేహేంద్రియ, మనో బుద్ధ్యహంకారములు లేనివాడు; రూపరహితుడు. ఆయన పంచభూతములచే అసంబద్దుడు. ఆతడే అన్ని ప్రాణులకూ స్వామిగా, అందరినీ బంధనాలలో వుంచి నడిపించే నియంతగా, జగత్ప్రభువుగా విశ్వాన నెలకొనివున్నాడు. ఆయన చైతన్యరూపుడే కాని నిరాకారుడు. ఏ ఆసక్తీ లేనివాడైనా అందరి ఆసక్తులనూ తెలిసికొనగలడు. అందరు దేవతల చేత పూజింపబడు మహేశ్వరుడూ ఆయనే. తేజః స్వరూపుడై సత్త్వరజస్తమోగుణ భిన్నుడై కర్తృత్యాదిశూన్యుడై వెలుగొందువేల్పు విష్ణువు.
ఆయన వాసనారహితుడు, శుద్దుడు, సర్వదోషరహితుడు, పిపాసావర్ణితుడు, శోకమోహాదులకు బహుదూరుడు. జరామరణాలు ఆయనకుండవు, మోహము ఆయననంటదు. సృష్టిగాని ప్రళయంగాని ఆయనకు లేవు. శ్రీహరి సత్యస్వరూపుడు, నిష్కల పరమేశ్వరుడు, నామరహితుడు, జాగ్రత్ స్వప్నసుషుప్తిరహితుడు. అవస్థాదులకు అధ్యక్షుడు, శాంతస్వరూపుడు, దేవాధిదేవుడు ఆయనే. జాగ్రదాది మన అన్ని అవస్థలలోనూ వుండేవాడు, నిత్యుడూ ఆయనే గాని ఆయన మాత్రం కార్యకారణరహితుడు.
No comments:
Post a Comment