అణిమాది గుణసహితుడై జగత్సృష్టి సంహారాలను కావిస్తుండే శ్రీ మహావిష్ణువు మునులకు, దేవతలకు, దానవులకు కూడా ధ్యానగమ్యుడు, అత్యంత సుందరుడు. బ్రహ్మాది దేవతల నుండి సమస్త ప్రాణివర్గం యొక్క హృదయాలలో శ్రీహరియే ప్రాణమై వెలుగుతుంటాడు. సనాతనుడు, అవ్యయుడు, అన్నిటినీ అందరినీ మించిన కృపాళువు, ప్రభువు, నారాయణుడు, దేవాధిదేవుడునైన శ్రీహరి మకరాకృతిలో నున్న కర్ణకుండలాలతో శోభిల్లుతుంటాడు. ఆయనే దుఃఖవినాశకుడు, పూజకు అర్హుడు, మంగళమయుడు, దుష్ట సంహారకుడు, సర్వాత్ముడు, సర్వస్వరూపుడు, సర్వత్రగామి, భక్తుల సర్వగ్రహ దోష నివారకుడు నైన భగవంతుండు.
ఆయన నఖాల నుండి చల్లని వెన్నెలలు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది. సుందరములైన వేళ్ళు వేణువాదకుని వేళ్ళ వలె మృదువుగా వెలుగ్గా వుంటాయి. జగత్తుకే శరణ స్థలం జగన్నాథుడైన విష్ణువు. అందరికీ సుఖము నిచ్చు సంకల్పం, శక్తి ఆయనకున్నవి. సమస్త అలంకారాలచే అలంకృతుడై, ఆ భూషణాలే తమ పుణ్యాన్ని చూసుకొని మురిసి మెరసి పోతుండగా, సుందర దేహమంతటా చందనపు పూత చల్లటి అందాన్నిస్తుండగా సౌమ్య రూపుడై, సర్వదేవసమన్వితుడై 'నేనే అందరిలో నివసించి రక్షించు వాసుదేవుడను' అనే భావనతో భాసించువాడు శ్రీ మహా విష్ణువు. అందరి భావనలలో వుండేది కూడా ఆ వాసుదేవుడే సూర్యమండలంలో వెలుగుతూ అగ్నిలో మండుతూ కనిపించేది కూడా ఆయనే.
ఇట్టి స్వరూపమున్న విష్ణుభగవానుని ధ్యానించు మానవులు పరమగతిని పొందగలరు. ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి ఈ విష్ణు స్వరూపాన్నే ధ్యానించి ధర్మోపదేశ కర్తృత్వార్హత పొంది స్మృతికారునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివిన వారికి కూడా పరమగతి ప్రాప్తిస్తుంది. (అధ్యాయాలు - 91,92)
వర్ణధర్మ నిరూపణ
శౌనకాది మహామునులారా! పరమ శివుని ప్రార్ధన మేరకు మహావిష్ణువు యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు.
యాజ్ఞవల్క్య మహర్షి మిథిలాపురిలో నున్నపుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మజ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్ధించారు. అన్ని వర్ణాలవారూ చేయవలసిన దానధర్మాది కర్తవ్యాలను వినగోరారు. వారికేది బోధించినా లోకకల్యాణానికే ఉపయోగపడుతుంది.
జితేంద్రియుడైన యాజ్ఞవల్క్యమహాముని సర్వప్రథమంగా విష్ణుభగవానుని ధ్యానించి ఆ ఋషులతో ఇలా చెప్పసాగాడు.
'మునులారా! ఏ దేశంలోనైతే కృష్ణసారమను పేరు గల మృగాలు తిరుగాడుతుంటాయో అదే ప్రపంచంలో పరమ పవిత్రమైన దేశం. (ఇదే నేటి భారతదేశం) ఆ దేశానికి చెందిన ధర్మాదిక విషయాలను వినిపిస్తాను.
పురాణాలూ, న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రాలు, శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందం, జ్యోతిషంతో బాటు నాలుగువేదాలూ - ఇవే ఈ దేశంలోని పదునాలుగు విద్యలకూ ఆధ్య స్థానాలు. మనువులు, విష్ణువు, యముడు, అంగిరుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శతాతపుడు, పరాశరుడు, ఆపస్తంబుడు, ఉశనుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితుడు, హారీతుడు, అత్రి, అల్పజీవినైన నేను - మేమంతా ఆ శ్రీహరిని ధ్యానించి తద్వారా ధర్మోపదేశకులమైనాము.
No comments:
Post a Comment