వర్ణసంకరం పనికిరాదు. ఏ వర్ణం వారు ఆ వర్ణం వారినే పెండ్లి చేసుకోవాలి. కొంతమంది విద్వాంసులు అగ్రవర్ణులు శూద్రకన్యలను పెళ్ళి చేసుకోవచ్చని వచిస్తారు కాని నేనుదాని కంగీకరించను. ఎందుకంటే 'ఆత్మా వైజాయతే పుత్రః అనీ 'అంగాదంగాత్సం భవసి' అని వేదం ఘోషిస్తోంది. ద్విజుడే శూద్రునిగా పుట్టి, ఆ శూద్రుడు ఈ ద్విజుని వలె, అంత జ్ఞానం సంపాదించకుండానే, గౌరవాదరాలు పొందాలనుకొని, సమాజం దానికడ్డుపడడంతో దానిపై, ద్విజజాతిపై కక్షగట్టి... ఇలా సమాజానికీ సవాలుగా నిలుస్తాడు. బ్రాహ్మణుడు తన వర్ణం నుండి ఒక కన్యను వివాహం చేసుకున్న పిమ్మట ఇతర వర్ణాల కన్యలను పెండ్లాడవచ్చనీ, క్షత్రియులు క్షత్రియ కన్యను పెండ్లాడిన పిమ్మట వైశ్య, శూద్ర కన్యలను వివాహమాడవచ్చుననీ, వైశ్యులు వైశ్య కన్యతో వివాహమైన పిమ్మట శూద్రకన్యను చేసుకోవచ్చుననీ, శూద్రుడు మాత్రం శూద్ర కన్యను మాత్రమే పెండ్లాడాలనీ పెద్దలంటారు. (అది సామాజికావసరమైనపుడే అంగీకార్యమయ్యేది) కన్యకి కనీసం ఒక అన్నదమ్ముడైనా వుండాలి. అంతేకాని, పుత్రికా ధర్మం గల కన్య ప్రశస్తం కాదు. ఈ కన్య యొక్క పుత్రుడే ఆమె తండ్రికి పిండం పెట్టవలసి వస్తే ఆమెను పుత్రికా ధర్మం గల కన్య అంటారు.
వివాహాలలో ఎనిమిది రకాలున్నాయి.
అవి బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపూపత్య, ఆసుర, గాంధర్వ, రాక్షస, పైశాచ విధాలు.
ఉత్తమ వంశానికి చెందిన, మంచి శీలస్వభావాలున్న వరుని మామయే స్వయంగా తన యింటికి పిలిచి, అలంకరించి, పూజించి కన్యాదానం చేయడం బ్రాహ్మ వివాహం. యజ్ఞం చేస్తూ ఋత్విజుని అలంకృతుని చేసి పూజించి కన్యనివ్వడం దైవ వివాహం.
వరుని నుండి ధర్మార్ధంగా ఒకటి రెండు జతల ఆవులను ఎద్దులను స్వీకరించి శాస్త్రోక్తంగా పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యడం ఆర్ష వివాహం.
వధూవరులనొకచోట చేర్చి 'మీరిద్దరూ కలసి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించండి' అని చెప్పి పూజ చేసి కన్యను దానం చేయడం ప్రాజాపత్యం.
కన్యకూ, ఆమె తండ్రికీ, ఆతని బంధువులకూ యథాశక్తి ధనాదులనిచ్చి స్వచ్ఛందంగా వరుడే కన్యను గ్రహించడం ఆసురవివాహం.
కన్యాబ్రహ్మచారీ పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకొనేది గాంధర్వం.
కన్యను అపహరించి గొనిపోయి వరుడు తన స్వగృహంలో శాస్త్రోక్తంగా చేసుకొనేది రాక్షస వివాహం.
అన్నిటికన్నా అధమమైనది నిదురిస్తున్న, కామంపట్టిన లేదా మతిలేని కన్యను ఎవరూ చూడకుండా పట్టుకుపోయి వరుడే చేసుకొనేది. దీనికి పైశాచ వివాహమని పేరు.
మొదటి నాలుగు రకాల వివాహాలూ బ్రాహ్మణ వర్ణంలోనూ తరువాతి రెండు విధాల పెళ్ళిళ్ళూ క్షత్రియ వర్ణంలోనూ తఱచుగా అవలంబింపబడుతూ వుంటాయి.
No comments:
Post a Comment