ఇక్కడి పురుషోత్తమ క్షేత్రానికి పోయి భగవాన్ జగన్నాథ, సుభద్రా, బలరాములను పూజించినవారికి జ్ఞానం, లక్ష్మి, పుత్రులు మున్నగునవన్నీ కలిగి సుఖంగా వుండే జీవనం, మరియు దేహాంతంలో విష్ణుసాన్నిధ్యం కలుగుతాయి. అలాగే పురుషోత్తముడను పేర ఇక్కడ వెలసిన జగన్నాథుని సమక్షంలోనూ, సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలోనూ పితరులకు పిండ దానాదులను నిర్వర్తించిన వారికి బ్రహ్మలోక నివాసం లభిస్తుంది.
ఈ క్షేత్రంలో వినాయకునీ, కపర్ది నామంతో వేంచేసియున్న పరమశివునీ నమస్కారంతో పూజించినవానికి అన్ని విఘ్నాలూ తొలగిపోతాయి. ఇక్కడే వెలసిన కార్తికేయ భగవానుని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ద్వాదశనామాలతో సూర్యదేవుని పూజించిన వారు సర్వరోగముక్తులవుతారు. వైశ్వానర భగవానుడైన అగ్నిదేవుని విధివత్తుగా పూజించి ఉత్తమ కాంతిని పొందడానికీ, రేవంతుని ఆరాధించి ఉత్తమాశ్వాలను సంపాదించడానికీ, ఇంద్రదేవునారాధించి మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందడానికీ, గౌరీ దేవికి పూజలు చేసి అతులిత సౌభాగ్యాన్నందడానికీ, సరస్వతమ్మను పూజించి విద్యనూ, లక్ష్మీదేవిని పూజించి సర్వసంపదలనూ ఈ ఒక్క క్షేత్రంలోనే పొందవచ్చును. ఈ పురాణాధిపతియైన గరుత్మంతుని ఈ తీర్థంలో పూజించిన వారికి అన్ని విఘ్నాలూ ఎగిరిపోగా, బలమూ, వేగమూ వస్తాయి.
ఈ క్షేత్రపాలకుని పూజిస్తే గ్రహసమూహాల దోషాలన్నీ పోతాయి. ముండపృష్ఠమును పూజించిన వారికి అన్ని అభిలాషలూ నెరవేరుతాయి. ఇక్కడి అష్ట నాగదేవులను అర్చించిన వారిని పాము కాటు బాధింపదు. ఇక్కడ బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మలోక ప్రాప్తినొంద వచ్చును.
ఈ క్షేత్రంలో ఇంకా బలభద్రుని సమ్యక్ పూజ ద్వారా శక్తి, ఆరోగ్యాలనూ, సుభద్రా దేవ్యర్చన ద్వారా పరమ సౌభాగ్యాన్నీ, జగన్నాథ స్వామి పూజ ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధినీ, శ్రీమన్నారాయణ పూజ ద్వారా రాజ్యాధికారాన్నీ, నృసింహదేవుని చరణ స్పర్శ, నమస్కృతుల ద్వారా సంగ్రామ విజయాన్నీ, వరాహ స్వామి పూజద్వారా పృథ్విపై ఆధిపత్యాన్నీ, మాలాధర, విద్యాధరుల పూజ ద్వారా స్పర్శ ద్వారా విద్యాధర పదాన్నీ, ఆదిగదాధరుని ఆరాధన ద్వారా సమస్తాభీష్టసిద్ధినీ, సోమనాథుని పూజ ద్వారా శివలోక ప్రాప్తినీ, రుద్రదేవునికి నమస్కరించడం ద్వారా రుద్రలోకంలో ప్రతిష్టాపితులయ్యే భాగ్యాన్నీ భక్తులు పొందగలరు.
ఈ గయా క్షేత్రంలో వెలసిన ఆదిగదాధరస్వామి మహిమలను వర్ణించడం సామాన్యులకు అసాధ్యం. రామేశ్వర, కాళేశ్వర, బ్రహ్మేశ్వర, కేదారనాథ, సిద్ధేశ్వర రూపాలలో పరమశివుడే ఇక్కడ వెలసి భక్తులకు అన్నీ ఇస్తూ తాను మాత్రం ఆదిగదాధరుని దర్శించుకుంటూ వుంటాడు. రుద్రునితో బాటు ఆదిగదాధరుని ఒకే రోజు దర్శించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమే గాక వారి వంశాల్లో వందతరాలు ఉద్దరింపబడతాయి.
గదాధర భగవానుని పూజించిన ధర్మార్దికి ధర్మమూ, ధనార్ధికి ధనమూ, కామార్ధికి కామమూ, మోక్షార్ధికి మోక్షమూ అలవోకగా దొరుకుతాయి. అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్యపుత్రాదులు కూడా.
No comments:
Post a Comment