Friday 7 June 2024

శ్రీ గరుడ పురాణము (198)

 


రుచి ప్రజాపతితో పితరుల సంవాదం


శౌనకాది మహామునులారా! మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను, వినండి.


ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయా మోహమునుండి విడివడి, నిర్భయుడై, ఎక్కువ జపతపాలను చేస్తూ, కర్మలను గావిస్తూ, తక్కువ నిద్రిస్తూ, నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృధ్విపైనే గడపసాగాడు, క్రమంగా అగ్ని హోత్రాన్నీ, గృహస్థాశ్రమాన్నీ పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతుండగా పితృ దేవతలతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు:


"వత్సా! నీవింకా వివాహమెందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమనీ, అది స్వర్గ, మోక్షప్రాప్తికి మార్గమనీ నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు; సమస్త దేవతలనూ, పితరులనూ, ఋషులనూ, అతిథులనూ, యాచకులనూ భోజనం ద్వారా పూజాదానాదుల ద్వారా సంతృప్తిపఱచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు; దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వధామంత్రాలతోనూ అతిధులనూ, ధృత్యాదులనూ అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయక పోవడం వల్ల నీ పితృ, దేవ ఋణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుష్యులకూ, ఋషులకూ, అన్యజీవాలకూ కూడా నువ్వు ఋణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరిదశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు, మొదటి మెట్టుని కూడా చేరుకోని బతుకులెందుకు? పుత్రా! ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా క్షేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి.


రుచి మిక్కిలి వినయంతో ఇలా బదులిచ్చాడు. మహానుభావులారా! మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్నీ, పాప సంగ్రహాన్నీ, అనంతకాలం దాకా అధోగతినీ కలుగజేస్తుందనీ అందుచేత దేనినీ గ్రహించనివాడే ధన్యుడనీ విని యున్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టు అయిన స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గ లేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలనూ నాశనం చేసే శక్తి ఆశకి వుంది. అందుకే నేనేదీ ఆశించలేదు. విద్య ద్వారా, సద్ జ్ఞానోపార్జన రూపియైన జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగినవాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు, విద్వాంసులెంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకి దాసోహమై పోయే మనిషే స్త్రీ వెంటా, వివాహం వైపూ పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై, తత్త్వజ్ఞానమనే తేటనీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను.'


No comments:

Post a Comment