ద్విజులు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకుమూతపెట్టి వుంచినదాన్ని తినాలి. అతిథికోసం భోజనం ఎప్పుడూ కూడా ఎంత సాయంకాలమైనా సిద్ధంగావుండాలి. రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నంతినకుండా పోరాదు. బ్రహ్మచారులకూ సన్యాసులకూ (వారు లభిస్తే, వాళ్ళు దొరకడమే అదృష్టం) రోజూ భిక్షవేయాలి. స్నాతకులనూ, ఆచార్యులనీ, రాజునీ ప్రతియేటా పూజించాలి. అలాగే మిత్రులూ, అల్లుళ్ళూ, ఋత్విజులూ ప్రతి వర్షమూ ఆతిథ్య పూజలకు అర్హులు. బాటసారిని అతిథియనీ వేదపారంగతుని శ్రోత్రియుడనీ అంటారు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకొనేవారు ఈ రెండు రకాల వారిని పూజించాలి.
ఎవరైనా మిక్కిలి వినయంగా, ఆదరంగా, గౌరవంతో ఆహ్వానిస్తేనే బ్రాహ్మణుడు, ఒకరియింటి పక్వాన్నాన్ని స్వీకరించాలి. గృహ మితంగా భుజించాలి. నోటిని అనవసరంగా వాడకూడదు. ఏ విషయంలోనూ అతిచాంచల్య చాపల్యాలు కూడదు. అతిథులను సగౌరవంగా ఊరిపొలిమేరదాకా దిగబెట్టి సముచితంగా వీడ్కోలు పలకాలి.
తనకు ఇష్టులైన మిత్రులతో విద్వత్సంపన్నులతో గోష్ఠులు సలుపుతుండాలి. సాయంకాలం మరల సంధ్యవార్చి అగ్నిహోత్రం పనిచూసుకొని భోంచేయాలి. భోజనం తరువాత బుద్ధిమంతులైన భృత్యులతో ఇంటి వ్యవహారాలనూ, రాబోయే కార్యాలనూ ముచ్చటించాలి.
వైశ్యులకూ, క్షత్రియులకూ కూడా యజ్ఞానుష్ఠానమూ, అధ్యయనమూ, దానమూ ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికి యజ్ఞమును చేయించుట, అధ్యాపనం, దానగ్రహణం అనేవి అదనపు ధర్మ కర్మలు.
క్షత్రియునికి ప్రజాపాలనమే ప్రధానధర్మము. వైశ్యవర్ణులకు అప్పులిచ్చుట, వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన ముఖ్య కర్మలుగా విధింపబడ్డాయి. శూద్ర వర్ణం వారు పై మూడు వర్ణాల వారికీ సాయపడాలి. ద్విజులు యజ్ఞాదికర్తవ్యాలను మానరాదు. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ సంయమనం, దమం, క్షమ, సరళత, దానం- మానవులందరికి అవశ్యాచరణీయ ధర్మాలు. అందరూ కుటిల, దుష్టప్రవృత్తులను పరిత్యజించాలి.
ప్రధానం క్షత్రియం కర్మ ప్రజానాం పరిపాలనం ॥
కుసీదకృషి వాణిజ్యం పశుపాల్యం విశః స్మృతం |
శూద్రస్యద్విజ శుశ్రూషా ద్విజోయజ్ఞాన్ నహాపయేత్ ॥
అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ సంయమః |
దమం క్షమార్జవం దానం సర్వేషాం ధర్మసాధనం ॥
ఆచరేత్ సదృశీం వృత్తమజిహ్మామశరాం తథా ।
(ఆచార 96 (27-30))
No comments:
Post a Comment