Wednesday, 19 June 2024

శ్రీ గరుడ పురాణము (210)

 


బ్రహ్మచారి చేత విధివిహిత క్రియలన్నిటినీ చక్కగా చేయించి, వానికి వేదమునందు శిక్షణ నిచ్చినవాడే 'గురు' శబ్దానికర్హుడు. యజ్ఞోపవీతధారణ మాత్రమే చేయించి వేదాన్ని చెప్పే వానిని 'ఆచార్యు'డంటారు. వేదంలోని ఒక దేశాన్ని* మాత్రమే అధ్యయనం చేయించిన వానిని 'ఉపాధ్యాయుడ'ని వ్యవహరిస్తారు. (* మంత్రమనీ బ్రాహ్మణమనీ వేదానికి రెండు రూపాలుంటాయి. ఇందులో ఒక రూపాన్ని గానీ ఆ రూపంలోని ఒక భాగాన్ని గానీ బోధించడాన్ని 'ఏకదేశాధ్యాపన' మంటారు.) ఒక యజమానిచే 'వరించ' బడి అనగా గౌరవం మీరగా పూజింపబడి అతనిచే యజ్ఞమును సంపన్నము చేయించేవానిని 'ఋత్విక్' అంటారు. బ్రహ్మచారిగా నున్నవానికి, ఆ తరువాతి కాలంలో కూడా ఈ నలుగురూ యథాక్రమంగా పూజార్హులే. వీరందరికంటే పూజ్యురాలు తల్లి. 


నాలుగు వేదాలూ అధ్యయనం చేయదలచుకొన్నవారు ఒక్కొక్క వేదానికీ పన్నెండేసి సంవత్సరాల చొప్పున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అంతకాలం పాటు ఆశ్రమంలో నుండుట సాధ్యపడని వారు అతిశయధీమంతులు అయితే అయిదేసి యేళ్ళకే ఈ వ్రతాన్ని కుదించుకోవచ్చు. కేశాంత సంస్కారము, పదహారవ, ఇరువది రెండవ, ఇరువది నాల్గవ యేట, క్రమంగా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు చేయబడాలి. ఈ వర్ణాల వారికి ఉపనయనం కూడా క్రమంగా ఆయా వయసు పూర్తయ్యేనాటికి తప్పనిసరిగా చేయబడివుండాలి. లేకుంటే వారు పతితులై, సర్వధర్మాచ్యుతులై పోతారు. వ్రాత్యస్తోమమను క్రతువును చేసిన తరువాత, అదీ కొంతకాలం గడచిన తరువాతనే వారికి మరల యజ్ఞోపవీతధారణకు యోగ్యత కలుగుతుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణ పురుషులకు ద్విజులని పేరు. ద్వి..జ.. అనగా రెండుమార్లు పుట్టినవారని. తల్లి కడుపున తొలిసారి పుడతారు కదా! అది కాక ఉపనయన మైనపుడు మరల పుడతారు. అది రెండవ జన్మ కింద లెక్క కాబట్టి వారు ద్విజులు.


శ్రాత-స్మార్త యజ్ఞాలనూ, తపశ్చర్య (చాంద్రాయణాది వ్రతాలు) నూ, శుభకర్మలనూ (ఉపనయనాది సంస్కారాలు) బోధించగలిగేది వేదమొక్కటే. ద్విజులకు, అందుకే, వేదమే పరమ కల్యాణ సాధనము. అలాగే వేదమూలకములగు స్మృతులు కూడ.


వేదాధ్యయనం చేయగనే సరికాదు. ప్రతిదినం ఋగ్వేదమునధ్యయనం చేసేవాడు దేవతలను తేనెతోనూ పాలతోనూ, పితరులను తేనెతోనూ, నేతితోనూ తృప్తిపఱచాలి. అంటే శాస్త్రోక్తంగా పూజించి నైవేద్యం పెడితే వారు దిగివచ్చి స్వీకరించి సంతసిస్తారు. మిగతా మూడు వేదాలలో దేనిని ప్రతిదినం అధ్యయనం చేసే వారైనా నేతితో అమృతంతో పితరులనూ దేవతలనూ సంతోషపెట్టాలి. అలాగే ప్రతిదినం వాకోవాక్యం (ప్రశ్నోత్తర రూపంలో వుండే వేదవాక్యాలు), పురాణం, నారాశంసీ (రుద్ర దైవత్య మంత్రాలు), గాథికా (యజ్ఞ సంబంధితాలైన ఇంద్రాదుల గాథలు), ఇతిహాసాలు (వారుణీ వంటి విభిన్న, అసాధారణ విద్యలు) విద్యా... లను అధ్యయనం చేసే ద్విజుడు పితరులనూ దేవతలనూ, మాంసం (ఫలాలు)..., పాలు, అన్నములతో తృప్తి పఱచాలి.  


No comments:

Post a Comment