గృహస్థధర్మానికి మూలం పతివ్రతయగు గృహిణి. ఆమె పతి చిత్తవృత్తిని కూలంకషంగా తెలుసుకొని వుండాలి. అతడెపుడేది కోరుకుంటాడో దానిని అప్పటికి అతడు అడగకుండానే అమర్చిపెట్టాలి. సర్వకాల సర్వావస్థలలోనూ అతని మేలునే కోరుతూ తన ప్రతిపనీ ఆ ఆశయం వైపే మళ్ళేలా చూడాలి, చేయాలి.
భర్త యొక్క తల్లిదండ్రులనూ, అక్కచెల్లెళ్లనూ, అన్ననూ, పినతండ్రినీ, గురువునీ, వృద్ధ స్త్రీలను గౌరవించడం ఆదరించడం పత్నియొక్క ధర్మం. తనకన్నా చిన్నన్నవారైన భర్తృ వర్గీయులతో స్నేహంగా వుంటూనే ఇంటి పనులు చేయించుకోవాలి. లేకుంటే సోమరులవుతారు. పతి యొక్క బంధువుల మధ్యలో తాము కూర్చునియున్నపుడామె యొక్క మాటలు, చేతలు అన్నీ అతనికి అనుకూలంగానే సాగాలి; ఈ సంగతి అందరికీ తెలియాలి. ఈ శీలమే ప్రశస్తమని జనశ్రుతి.
ఇంటికోడలు తనకు వరసైన పురుషులతో హాస్యాలాడకూడదు. పర పురుషునితో ఏకాంతంగా అసలు ఉండనేకూడదు. పరపురుషుల చేతిలో ఏ వస్తువునూ ఉంచకూడదు, వారి చేతి నుండి తన చేతితో అందుకొనరాదు. భర్త అక్కడే వున్నా కూడా పరపురుషుల మధ్య కూర్చొనరాదు.
ఇంటిలోని సామగ్రి అంతా ఆమె అధీనంలోనే వుంటుంది. దానిని అనవసరంగా ఖర్చు చేయకూడదు. అవసరానికి తగినంతగా వాడుతుండాలి. కార్యకుశల, ప్రసన్న, మితవ్యయి అయివుండి రోజులో ఒకసారైనా అత్తమామలకు పాదాభివందనం చేసే స్త్రీని భర్త ప్రేమిస్తాడు, సమాజం గౌరవిస్తుంది. ప్రోషిత పతికగానున్నపుడు- అనగా తన భర్త పరదేశానికి వెళ్ళినపుడు తన సఖీజనంతో ఆనందంగా ఆటలాడడం, పొరుగు వారిళ్ళలో కూర్చుని వాగడం, అతిగా అలంకరించుకోవడం, ఉత్సవాలలో పాల్గొనడం, హాసాలూ పరిహాసాలూ వంటివి చేయరాదు.
ఇల్లాలి మనుగడ పతితోనే. వీలైనంత వఱకు ఆమె గడపవలసిన సమయమూ అతనితోనే. ఆమె అధికారాలు పరిమితమే అయినా గృహస్థధర్మానికీ తద్వారా సమాజానికీ ఆమె అవసరం అపరిమితం. అందుకే సదాచారిణియైన స్త్రీ మరణించినపుడు అగ్నిహోత్రం లోని అగ్నితో ఆమె దహన సంస్కారాలను చేస్తారు. పతిహితైషిణియైన పత్నికి ఈ లోకంలో కీర్తి సమ్మానాలూ పరలోకంలో స్వర్గమూ సంప్రాప్తిస్తాయి.
(అధ్యాయం - 95)
No comments:
Post a Comment