Tuesday, 18 June 2024

శ్రీ గరుడ పురాణము (209)

 


ఓం ఆపోజ్యోతీ... మున్నగు మంత్రాలు గాయత్రి మంత్రానికి శిరోభాగాలు. ఈ శిరోభాగయుక్తమైన ప్రతి మహావ్యాహృతికీ ఒక్కొక్కమారు ప్రణవాన్ని జోడించి మూడు మహావ్యాహృతులతో గాయత్రి మంత్ర మానస జపాన్ని చేస్తూ నోటిలో ముక్కులో కదలుతుండే గాలిని నియంత్రించాలి.


సాయంకాలం ప్రాణాయామం చేసి మూడు జలదేవత మంత్రాలను చదివి నీటిని తలపై చిలకరించుకొని పశ్చిమం వైపు కూర్చుని నక్షత్రదర్శనమయ్యే దాకా గాయత్రిని జపించాలి. ఇలాగే ఉదయసంధ్యలో కూడా గాయత్రిని జపిస్తూ తూర్పు వైపు తిరిగి సూర్యోదయం దాకా స్థిరంగా కూర్చుని వుండాలి. ఈ రెండు సందెలలోనూ వంశాచారాన్ని బట్టి సంధ్యావందనం చేయాలి. తరువాత అగ్నిహోత్ర కార్యమును కూడా చేయాలి.


తరువాత 'నేను అముకుడను' (ఏమీ రానివాడను) అంటూ వృందజనులకు అనగా గురువులకూ, వృద్ధులకూ ప్రణామం చేయాలి. అటుపిమ్మట సంయమియైన బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై, (ఆలోచనలను అటూ ఇటూ కదలాడనీయకుండా) స్వాధ్యాయం చేసుకొని గురువుగారికి తనను తాను అధీనం చేసుకోవాలి. ఆయన పిలిచినపుడు పోయి విద్య నేర్చుకోవాలే గాని 'నేర్పండి' అని అడగడం సరికాదు. అడగడమే అవిధేయత. భిక్షాటన చేసి తెచ్చిన ద్రవ్యాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలి. మనసు, మాట, శరీరము - ఈ మూడింటినీ ఎల్లపుడూ గురువుగారి హితంలోనే సంలగ్నం చేయాలి.


బ్రహ్మచారి దండము, మృగచర్మము, యజ్ఞోపవీతము, ముంజమేఖల అను వాటిని గౌరవంగా భావించాలి. అవే అతనికొక గుర్తింపునిస్తాయి. ఏ వర్ణం వారైనా బ్రహ్మచారిగా నున్నంతకాలం భిక్షాటనం చేయవలసినదే. బ్రాహ్మణుల గృహములకు పోయి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్థులు క్రమంగా భవతి భిక్షాందేహి, భిక్షాంభవతి దేహి, భిక్షాం దేహిభవతి అనే వాక్య ప్రయోగంతో యాచించాలి. భవతి అనగా 'అమ్మా' అని ఆ యింటి స్త్రీమూర్తిని సంబోధించుట.


భిక్షాటనానంతరము ఆశ్రమానికి వచ్చి అగ్నికార్యం చేసుకొని గురువుగారి ఆజ్ఞ అయినాక ఆపోశన క్రియను పూర్తిచేసి సమానులతో కలిసి కూర్చుని వినయపూర్వకంగా ఆపోశన పట్టాలి. ('భోజనానికి ముందు ఒకసారి చివరనొకమారు నీటితో ఆచమనం చెయ్యడాన్ని ఆపోశన లేదా అవుపోసన అంటారు. ఈ సమయంలో అమృతోపస్తరణమసి అనే వాక్యమును చదవాలి. ) తరువాత భిక్షాన్నమును నిందించకుండా, ప్రీతి పురస్సరంగా తినాలి. మౌనంగా భోంచేయాలి. బ్రహ్మచర్య వ్రతంలో నున్నంత కాలం, కఱువు కాటకాలు లేని రోజుల్లో, రోజూ ఒకేచోట కాకుండా భిక్షాటన చేయాలి. బ్రహ్మచర్యాన్ని నియమ, నిష్ఠలతో పాటిస్తూ మితంగానే భుజిస్తూ గడపాలి. ఎవరైనా తద్దినం, శ్రాద్ధభోజనాలకి పిలిస్తే మాత్రం పోయి వారు పెట్టినవన్నీ తినాలి. ఎందుకంటే పితృదేవతలు బ్రాహ్మణరూపంలో వచ్చి భుజిస్తారు కాబట్టి. ఆ వేళలో కూడా తేనె, మద్యం, మాంసం, ఎంగిలి పదార్ధాలను స్పృశించరాదు.


No comments:

Post a Comment