ధర్మమనగా పుణ్యమే. పుణ్యానికి ఉత్పత్తి హేతువులు. శాస్త్ర విహిత దేశంలో, శాస్త్ర విహిత కాలంలో, శాస్త్ర విహితమైన ఉపాయంతో, యోగ్యులైన పాత్రులకు – అనగా విద్యచే తపముచే సమృద్ధులైన బ్రాహ్మణులకు- చేయబడు దానములు, సర్వశాస్త్రోక్త కర్మలు. ఈ దానాలూ ఈ కర్మలే పుణ్యము యొక్క ప్రత్యేక, విభిన్న రూపాలని తెలుసుకోవాలి. ధర్మ లేదా పుణ్యమునుత్పత్తి చేసే ఈ దాన, కర్మముల ముఖ్య ఫలం అనగా పరమ ధర్మం యోగం (చిత్త వృత్తి నిరోధం) ద్వారా కలిగే ఆత్మదర్శనం లేదా ఆత్మసాక్షాత్కారమే. ఈ సాక్షాత్కారానికి దేశ కాల నియమాలుండవు. అది ఎప్పుడైనా ఎక్కడైనా యోగం ద్వారా కలుగవచ్చును. అయితే దానాలకూ, కర్మలకూ దేశకాల పాత్రల ఆవశ్యక ముంటుంది. వీటిలో కొన్ని మార్పులు చేర్పుల విషయంలో సందేహాలుంటే వాటిని పరిషత్ అనగా ధర్మసభ తేల్చి చెప్పాలి. ఈ ధర్మ పరిషత్తు వేద, ధర్మశాస్త్ర పరిజ్ఞానులైన ముగ్గురు, నలుగురు సద్రాహ్మణులతో నేర్పడి వుంటుంది. ఇదే కాక జనవంద్యుడైన బ్రహ్మవేత్త, వేదశాస్త్ర జ్ఞాతయైన బ్రాహ్మణుని మాటకు కూడా విలువ వుంటుంది.
ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములను నాలుగు వర్ణాలున్నాయి. (ఇవి కులాలు కావు. ఆనాటి సమాజంలో వ్యక్తుల కర్మాచరణను బట్టి ఏర్పడిన వ్యవస్థలో భాగాలు మాత్రమే... అను.) వీరిలో పై మూడు వర్ణాల వారినీ ద్విజులంటారు. గర్భాదానము నుండి శ్మశాన పర్యంతము వీరి సమస్త క్రియలనూ మంత్రాల ద్వారానే చేయాలి.
గర్భాదాన సంస్కారం ఋతుకాలంలోనే చేయాలి. గర్భస్పందనకు పూర్వమే పుంసవన సంస్కారం చేయబడాలి. గర్భాదానానికి ఆరవ లేదా ఎనిమిదవ నెలలో సీమంతోన్నయన సంస్కారం చేస్తారు. సంతానోత్పత్తి తరువాత జాతకర్మ, పదకొండవ రోజున నామకరణ సంస్కారం విధాయకాలు. నాలుగవ నెలలో నిష్క్రమణ, ఆరవ నెలలో అన్నప్రాశ్న సంస్కారాలు గావించాలి. తరువాత వంశాచారాన్ని బట్టి చూడాకరణ సంస్కారాన్ని నెరవేర్చాలి.
ఇలా సంతానానికి విహిత సంస్కారాలను శాస్త్రోక్తంగా దానాదికయుక్తంగా చేయడం వల్ల బీజ (శుక్ర), గర్భ (శోణిత) కారణోత్పన్నాలైన సర్వపాపాలూ నశిస్తాయి. స్త్రీలకు చేసే సంస్కారాలు (పేరంటాలు) వివాహం తప్ప అన్నీ సామాన్యంగా అమంత్రకాలే. అంటే మంత్రం అక్కరలేదు.
No comments:
Post a Comment