Tuesday 4 June 2024

శ్రీ గరుడ పురాణము (195)

 


గదాధర మాహాత్మ్యమింకా ఇలా చెప్పబడింది. 


శ్రాద్దేన పిండ దానేన అన్నదానేన వారిదః ॥ 

బ్రహ్మలోక మవాప్నోతి సంపూజ్యాది గదాధరం 

పృథివ్యాం సర్వతీర్థేభ్యో యథాశ్రేష్టా గయాపురీ ॥ 

తథాశిలాది రూపశ్చ శ్రేష్ఠ శ్చైవ గదాధరః | 

తస్మిన్ దృష్టే శిలాదృష్టా యతః సర్వం గదాధరః ||


(ఆచార ...86/38-40)


(అధ్యాయం - 86)


పదునాలుగు మన్వంతరాలూ పదునెనిమిది విద్యలూనూ


రుద్రాదిదేవతలారా! పూర్వకాలంలో సర్వప్రథమంగా స్వాయంభువ మనువుద్భవించాడు. ఆయనకు అగ్నీధ్రాది పుత్రులు జనించారు. ఈ మన్వంతరంలో అనగా ఈ మనువు కాలంలోనే మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, వసిష్ఠులనే సప్తర్షులుదయించారు. తరువాత నేర్పడిన పన్నెండు దేవగణాలలో జయ, అమిత, శుక్ర, యామ అను గణాలు సోమపాయులు. వీరి నుండి విశ్వభుక్, వామదేవులనే వారు ఇంద్రపదవిని సాధించారు. వాష్కలి అను రాక్షసుడు ఈ కాలంలోనే వీరిని పీడించి విష్ణువు చక్రాయుధం దెబ్బకు మరణించాడు.


తరువాత స్వారోచిషమనువు ఉద్భవించాడు. ఇతనికి చైతక, వినత, కర్ణాంత, విద్యుత్, రవి, బృహద్గుణ, నభులను పుత్రులు జనించారు. వీరిలో నభుడు మహాబలిగా, మండలేశ్వరునిగా, పరాక్రమశాలిగా ప్రసిద్ధుడైనాడు. ఈ మన్వంతరంలో ఊర్జ, స్తంభి, ప్రాణ, ఋషభ, నిశ్చల, దత్తోలి, అర్వరీవాన్- అను పేరు గల ఏడుగురు మహామునులు సప్తర్షులుగా ప్రసిద్ధులైనారు. ఈ కాలంలోనే పన్నెండు తుషితగణాలూ, పారావత దేవగణాలూ ఏర్పడ్డాయి. విపశ్చిత్తుడను నాయకుడు ఇంద్ర పదవినధిష్టించాడు. అతని శత్రువైన పురుకుత్సర నామకుడగు దైత్యుని శ్రీ మధుసూదనదేవుడు ఏనుగు రూపంలో సంహరించాడు.


అనంతరం ఔత్తరమనువుద్భవించాడు. ఈయనకు అజ, పరశు, వినీత, సుకేతు, సుమిత్ర, సుబల, శుచి, దేవ, దేవావృధ, మహోత్సాహ, అజిత నామకులు పుత్రులు దయించారు. ఈ మన్వంతరంలో రథౌజ, ఊర్ధ్వబాహు, శరణ, అనఘ, ముని, సుతప, శంకువులనే మహామునులు సప్తర్షులైనారు. వశవర్తి, స్వధామ, శివ, సత్య, ప్రతర్దన అను పేర్లు గల అయిదు దేవగణాలు జనించాయి. ప్రతి గణంలోనూ పన్నెండుగురేసి దేవతలుండే వారు. స్వశాంతి నామధేయుడు ఇంద్రుడు కాగా అతని శత్రువైన ప్రలంబాసురుడనే రాక్షసుని విష్ణుదేవుడు మత్స్యావతారమును ధరించి సంహరించాడు.


No comments:

Post a Comment