Saturday, 1 June 2024

శ్రీ గరుడ పురాణము (192)

 


గయా తీర్ధంలో పిండ ప్రదాన మహిమ


గయలో పిండదాన మొనరించువారు ప్రేత శిలాది తీర్థాలలోస్నానం చేసి అస్మత్కులే మృతాయేచ (ఈ మంత్రాలు సంపూర్ణంగా అనుబంధం-9లో ఇవ్వబడ్డాయి), మున్నగు మంత్రాల ద్వారా తమ శ్రేష్ట పితరులను ఆవాహనంచేసి వరుణానది యొక్క అమృత మయ జలాలతో పిండదానం చేయాలి.


ఆ మంత్రాల భావం ఇలా వుంటుంది.


నా పితృ వంశంలో గాని మాతృవంశంలో గాని మరణానంతర సద్గతులు పొందని వారిని ఈ దర్భపృష్టంపై తిలోదకం ద్వారా నా పితరులందరినీ ఆవాహన చేస్తున్నాను. వారందరికీ సద్గతులు కలగడానికే నేనీ పిండ ప్రదానం చేస్తున్నాను. నా 'పై' రెండు వంశాలలో వృతి నొందిన సర్వులకూ సద్గతికై నేనిపుడు పిండప్రదానం చేస్తున్నాను. వీరంతా ఉద్ధరింపబడాలనేదే నా ఆశయము. సహజ మరణం పొందినవారికీ, బలవన్మరణం పొందినవారికీ కూడా నేనీ పరమ పుణ్యక్షేత్రమైన గయలో పిండప్రదానం చేస్తున్నాను. రౌరవ, అసిపత్ర, కుంభీపాక నరకాలలో... పడివున్న నా ఇరువంశాల మృతులనూ ఉద్దరించి ఉత్తమగతులకు పంపడం కోసం నేను వారందరినీ ఆవాహన చేసి పిండప్రదానం చేస్తున్నాను. అలాగే అంధతామిస్ర, కాలసూత్ర నామక నరకాలలోనూ, ప్రేతలోకంలోనూ పడియున్న నా పితరులందరినీ ఉద్దరించడానికి నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. మానవజన్మ దుర్లభమై, మానవేతర యోనుల్లో జనించి జీవిస్తున్న నా పితరులందరికీ నేనిక్కడ పిండప్రదానం చేస్తున్నాను.


పుత్ర, పత్నీ రహితులుగా మరణించిన నా ఈ జన్మ బాంధవులకూ, నా పూర్వజన్మ బంధువులకూ కూడా ముక్తి కలగడం కోసం నేనిక్కడ పిండప్రదానం చేస్తున్నాను.


నా పితరులలో ఇతర ఇంతు, వృక్షయోనులలో జనించిన వారికి ఉత్తమ గతులను కలిగించడం కోసం కూడా నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. ప్రేతరూపంలో శాపవశాత్తూ ఉండిపోయిన నా వారికి కూడా నేనీ అద్బుత పుణ్యక్షేత్రంలో పిండప్రదానం చేస్తున్నాను. ఇంకా గర్భస్రావితాత్మత లతో సహా నా పితరులందరికీ ఉత్తమగతులకై నేనిక్కడ పిండ ప్రదానాలను గావిస్తున్నాను.


బ్రహ్మేశానాది దేవతలారా! మీరంతా నా ప్రయత్నానికి సాక్షులుగా వుండాలని ప్రార్థిస్తున్నాను. నేను గయా క్షేత్రానికి వచ్చి నా వారందరికీ ఊర్థ్వలోక ప్రాప్తి కలిగించే ప్రయత్నంలో భాగంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించి పిండప్రదాలను సంపన్నం చేశాను.


No comments:

Post a Comment