సవర్ణ వివాహాలలో గృహ్యసూత్రానుసారం కన్య వరుని పాణిగ్రహణం చేయాలి. కృతత్రేతా ద్వాపరయుగాల్లో క్షత్రియ కన్య బ్రాహ్మణ వరునిగానీ వైశ్యవరుడు శూద్ర కన్యను గానీ ఇదివఱకే చెప్పినట్టు వివాహం చేసుకోవడం ఆచారంగా కొన్నిచోట్ల ప్రత్యేక సందర్భాలలో జరిగేది. కలియుగంలో ఈ పద్దతి ఎక్కడా, ఎటువంటి సందర్భాలలోనూ లేదు. వర్ణసంకరం జరుగరాదు.
కన్యాదానాన్ని గావించే అధికారం కన్య యొక్క తండ్రికీ, తాతకీ, సోదరునికీ సకుల్యునికీ లేదా తల్లికీ వుంటుంది. (సకుల్యులనగా ఎనిమిదవ తరం నుండీ పదవతరం దాకా నున్న బంధువులు) తండ్రిదే ఈ ధర్మం, ఈ భాగ్యం. ఆయన లేకపోయినా, ఉండీ మతిస్థిమితం లేనివాడై పోయినా తాతకీ, అలా అదే క్రమంలో తరువాత చెప్పబడిన వారికీ ఈ అవకాశమివ్వబడుతుంది. కన్యాదానం చేయవలసినవాడు చేయకపోతే వానికి ఆ కన్య ఋతుమతియైనపుడల్లా ఒకటొకటిగా భ్రూణహత్యల పాపం చుట్టుకుంటుంది. కన్యాదాతలు లేనపుడు కన్యయే తనకు తానుగా తనను తాను దానము చేసుకొనే వెసులుబాటు కూడా అంగీకార్యమే.
కన్యను ఒకమారే దానంచెయ్యాలి. అలా చేసిన తరువాత ఆమె భర్తపై దౌర్జన్యం చేసి గాని మరొక విధంగా గాని ఆమెనపహరించి మరొకరికి దానమిచ్చువాడు చౌరకర్మతో సమాన పాపమునకు దండనార్హుడవుతాడు. ఆమె దోషమేమాత్రమూ లేకుండా పత్నిని పరిత్యజించు పతి దండనీయుడు. అత్యంత దుష్టురాలు (మహాపాతకి)గు పత్నిని పరిత్యజించవచ్చును.
ఒక కన్యను ఒక వరునికిచ్చుటకు వాగ్దానము చేయబడిన పిమ్మట వివాహానికి ముందే వరుడు మరణిస్తే ఆమెను జీవితాంతం వితంతువుగా గొడ్రాలిగా నుంచి వేయుట ధర్మము కాదు. ఆమెకు పుత్రవతి కావలెననే కోరిక వుంటే మరిది కాని, వరుని సపిండ, సగోత్రులలో నామెకు ఈడైనవాడెవరైనా కాని పెద్దల ఆజ్ఞ మేరకు ఆమెకు పుత్రుని సామాన్య పద్ధతిలోనే ప్రసాదించాలి. ఈ విధంగా ఈ పద్దతిలో నామెకు కలిగిన పుత్రుడు ఆ మృతి చెందిన వరుని యొక్క క్షేత్రజ్ఞ పుత్రునిగానే పరిగణింపబడతాడు.
వివాహిత స్త్రీ వ్యభిచారానికి అలవాటు పడిపోతే, ఆమెను మంచి దారిలో పెట్టడానికి ఆమె పతి, అతని బంధువులూ శాయశక్తులా ప్రయత్నించాలి. చివరి ప్రయత్నంగా ఆమె అసహ్యక జీవనంపై ఆమెకే వైరాగ్యం కలిగేలాగ, ఆమెను ఇంటిలోనే వుంచి గృహిణిగా ఆమెకు గల అధికారాలన్నిటినీ తొలగించాలి. అలంకరించుకోనీయకుండా మలినగానే వుంచాలి. ఏదో ప్రాణరక్షణకు సరిపడునంతగానే తిండిపెట్టి కటిక నేలపై పడుకోబెట్టాలి.
No comments:
Post a Comment