Tuesday 11 June 2024

శ్రీ గరుడ పురాణము (203)

 


మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పటంలో భాగంగా ఇలా అన్నాడు. హే క్రౌంచిక మునిశ్రేష్ఠా! రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడిన తేజస్స్వరూపులైన ఆతని పితృగణం వారందరూ దశదిశలనూ వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమయినారు. అతడు వారిలో ప్రతి ఒక్కరినీ మంత్ర సహితంగా గంధాక్షతాదులతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకొమ్మన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ, తనకు తగిన, శ్రేష్ఠురాలైన, దివ్యపత్నినీ ప్రసాదించమని వేడుకున్నాడు.


పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు. 'ఓ మునిసత్తమా! నాయనా! ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకొన్న పత్ని లభిస్తుంది. నీకామె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి మూడులోకాలకూ అధిపతి కాగల రౌచ్యుడనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై నాలుగు వర్ణాల ప్రజలనూ సృష్టించి చివరిలో ధర్మ, తత్త్వజ్ఞానాన్ని పొంది సిద్ధినొందుతావు.


ఇక నీ స్తోత్రం మమ్మెంతో సంతోష పెట్టింది. కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తిశ్రద్ధలతో మమ్ము ప్రార్ధించిన వారి పట్ల సుప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలనూ, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్నీ, ఆయురారోగ్యాలనూ, పుత్రపౌత్రాదులనూ ప్రదానం చేస్తాము. శ్రాద్ధకర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నపుడు వారికెదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శ్రాద్ధఫలితాన్ని అక్షయం చేస్తాం.


ఏ శ్రాద్ధకర్మలోనైతే ఈ స్తోత్రం చదువబడుతుందో అక్కడ మేము పన్నెండు సంవత్సరాలకు సరిపడునట్లుగా తృప్తి నొందుతాము. హేమంతరువులో ఈ స్తవనం చేయువానిపై మా అనుగ్రహం పన్నెండేళ్ళ వఱకూ, శిశిరంలోనైతే ఇరవై నాలుగు, వసంత, గ్రీష్మర్తువుల్లోనైతే పదహారు సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ వుంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడే ఈ స్తుతి మా అందరికీ అక్షయ తృప్తినిస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా వుంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని గావిస్తే మేము పదిహేనేళ్ళపాటు తృప్తినొందుతాము.


నాయనా రుచీ! ఈ సంపూర్ణ స్తోత్రం ఒకచోట వ్రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా వుంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్దకర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ యజమానిననుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా! మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత స్తుతిని తప్పక వినిపించాలి' అని చెప్పి పితరులు అంతర్ధానం చెందారు.


(మానవజాతికి పితరులు చేసిన ఈ వాగ్దానం శ్లోకరూపంలో అనుబంధం –10లో చూడండి.)


No comments:

Post a Comment