Sunday 23 June 2024

శ్రీ గరుడ పురాణము (214)

 


స్త్రీకి వివాహానికి పూర్వమే చంద్రుడు శుచినీ, గంధర్వులు సౌందర్యాన్నీ మధురవాణినీ, అగ్నిదేవుడు అన్ని రకాల పవిత్రతనీ ప్రసాదిస్తారు. కాబట్టి ఈ దేవతలకు పూజలందే భారతదేశం వంటి దేశాల్లో స్వభావసిద్ధంగా స్త్రీలందరూ పవిత్రులే అయివుంటారు. అయినా కూడా పూర్వకర్మల వల్ల తేడాలు రావచ్చు. అందుచే స్త్రీకి దోషమంటదనే నిశ్చయానికి రావడం సరికాదు. ఒక స్త్రీ తన పతికానివానిని మనసులో వాంఛిస్తే అదీ ఒక రకమైన వ్యభిచారమే అవుతుంది. అలాగే పరపురుషునితో సంపర్కాన్ని సంకల్పించినా వ్యభిచారమే కాగలదు. ఈ మానసిక వ్యభిచార దోషము ఆమె ఋతుకాలిక రజోదర్శనము కాగానే పోతుంది కాని మరల అటువంటి ఆలోచనలు చేయరాదు. నిజంగానే పరపురుషునితో సంగమించినా, తద్వారా గర్భధారణ చేసినా ఆ స్త్రీని పరిత్యజించవలెను. ఇలాగే గర్భవధ, పతివధ, బ్రహ్మహత్య, శిష్యులతో సంగమం వంటి పనులలో నేది చేసినా ఆమెను మహాపాతకిగా అభిశంసించి పరిత్యజించాలి.


మదిరాపానం చేసేది, దీర్ఘరోగిణి, శాశ్వతద్వేషి, వంధ్య, అర్ధనాశిని, అప్రియవాదిని, నిష్టురభాషిణి లేదా పతికి హాని చెయ్యడం కోసమే జీవించునట్లుండేది యగు భార్యను ఆమె భర్త పరిత్యజించవచ్చును; మరొక వివాహం చేసుకోవచ్చును. అయితే తాను మొదట వివాహం చేసుకొని ఇపుడు పరిత్యజించిన స్త్రీని దాన, మాన, సత్కారాదుల ద్వారా భరణ సమన్వితను చేస్తుండాలి. అలా చేయనివాడు మహాపాపిగా నిందితుడు.


అన్యోన్యంగా దంపతులుంటే ఆ గృహానికి ధర్మార్థ కామవృద్ధి - త్రివర్గవృద్ధి పుష్కలంగా వుంటుంది. భర్త పోయిన పిమ్మట ఇంకొక పురుషుని ఆశ్రయించకుండా అతని జ్ఞాపకాల బలిమితోనే జీవించే స్త్రీనీ, ఎట్టి విపత్కర పరిస్థితులెదురైనా భర్తను వదలిపోకుండా వుండే స్త్రీనీ లోకం నెత్తినబెట్టుకొని పూజిస్తుంది. ఈ లోకంలో యశంతోబాటు ఈ పాతివ్రత్యమహిమ వల్ల పరలోకంలో పార్వతీదేవి సాహచర్యం చేసే భాగ్యమబ్బుతుంది.


భార్యను పరిత్యజించినవాడామె సుఖంగా, ప్రసన్నంగా బతికేలా చూసుకోవాలి. తన సంపత్తిలో మూడవవంతు నామెకిచ్చెయ్యాలి.


No comments:

Post a Comment