Monday 24 June 2024

శ్రీ గరుడ పురాణము (215)

 


స్త్రీకి తన భర్త యొక్క ఆజ్ఞను పాలించుటయే పరమధర్మము. స్త్రీకి ఋతు లేదా రజోదర్శనమైన తొలి దినం నుండి పదహారవ రాత్రి వఱకు సంతానప్రాప్తికి అవకాశముంటుంది. పుత్రప్రాప్తి కోసమై పురుషుడు ఆ రాత్రులలో మాత్రమే ఆమెతో సంగమించాలి. ఇలా సంతానం కోసం మాత్రమే సంగమించి మిగతా కాలాల్లో ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే బ్రహ్మచర్య వ్రతం. అంతేగాని బ్రహ్మచర్యమంటే పెండ్లిని మానుకొనుట, స్త్రీవైపే చూడకపోవుట కాదు. పర్వతిథులలోనూ (అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నమ (మను-4/156)) ఋతుకాలం మొదటి నాలుగు రాత్రులందూ, దినము అనగా ఎప్పుడైనా పగటివేళా సంగమం నిషిద్ధం. మఘ, మూల నక్షత్రాలలో సంగమం వర్జ్యం.

ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే సుందరుడు, సబలుడు, సద్గుణవంతుడు, ఆరోగ్యవంతుడునైన కొడుకు పుడతాడు. స్త్రీ పట్ల అన్ని బాధ్యతలూ అనగా తిండి, బట్ట, ఇల్లు మున్నగునవే కాక ఆమె కామవాంఛను పూర్తిగా తీర్చి ఆమెను సంతృప్తి పఱచవలసిన బాధ్యత కూడా ఆమెను చేపట్టిన వానిపై వుంటుంది. పైగా ఈ బాధ్యతకు సంబంధించి ఇంద్రుడు స్త్రీలకొక వరాన్నిచ్చాడు. అదేమనగా స్త్రీ యొక్క కామవాసనను అనిషిద్ధ రాత్రులందు ఆమె పతి తప్పనిసరిగా తీర్చాలి. లేకుంటే వాడు పాపమును మూటకట్టు కుంటాడు.

స్త్రీని ఇంటియిల్లాలిగా గృహలక్ష్మిగా సంభావించి మెట్టినింటి వారంతా అనగా భర్త, వాని సోదరులు, వాని తల్లిదండ్రులు, ఇష్టబంధువులు ఆమెను మధురాహారముతో చీని చీనాంబరాలతో అలంకార విశేషాలతో ఎల్లప్పుడూ ప్రసన్నంగా సుఖంగా వుండేలా చూడాలి. ఇది సామాజిక బాధ్యత కూడా.

స్త్రీకి గల బాధ్యతలు బాగా ఎక్కువ. ముఖ్యంగా పురుషునితో స్త్రీ యొక్క ప్రవర్తన ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. పుత్రసంతానమైనా స్వర్గప్రాప్తియైనా స్త్రీకి 'భర్తకు తనపై గల' ప్రేమ ఆధారంగానే సంక్రమిస్తాయి కాబట్టి ప్రతి ఆడదీ తన పత్యారాధన ఫలితంగా, స్నేహఫలంగా పతి ప్రేమను పొందాలి. సాధారణ స్త్రీకి శాస్త్రాలను గాని గ్రంథాలను గాని పఠించే అర్హత లేదు కాని భర్త ద్వారా వాటన్నిటినీ ఆమె వినవచ్చును. విధి నిషేధ పూర్వకంగా భర్త చెప్పే ధర్మాచరణను సాంతమూ చేయడం ద్వారా మోక్ష ప్రాప్తి నందవచ్చును. భర్త అనంతరం కొడుకే ఆమెకు ధర్మశాస్త్రగురువు కాగలడు.

No comments:

Post a Comment