తరువాతి మనువు పేరు తామసుడు. ఆయన పుత్రులు జానుజంఘ, నిర్భయ, నవఖ్యాతి, నయ, విప్రభృత్య, వివిక్షిప, దృఢేషుధి, ప్రస్తలాక్ష, కృతబంధు, కృత, జ్యోతిర్ధామ, పృథు, కావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక నామకులు కాగా జ్యోతిర్ధార, దృష్టకావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక, సురాగ, స్వధీయులు సప్తర్షులు, హర్యాది నాలుగు దేవతాగణాలుండగా శిబి చక్రవర్తి ఇంద్రుడైనాడు. ఆతని శత్రువైన భీమరథ దైత్యుని శ్రీ మహావిష్ణువు కూర్మావతార మెత్తి సంహరించాడు.
అయిదవ మనువైన రైవతుని పుత్రులు మహాప్రాణ, సాధక, వనబంధు, నిరమిత్ర, ప్రత్యంగ, పరహ, శుచి, దృఢవ్రత, కేతుశృంగులు. ఇతని కాలంలోని సప్తర్షులు వేదశ్రీ, వేదబాహు, ఊర్ధ్వబాహు, హిరణ్యరోమ, పర్జన్య, సత్యనామ స్వధామనామధేయులు. ఈ మన్వంతరంలో అభూతరజ, దేవాశ్వమేధ, వైకుంఠ, అమృత నామక దేవగణాలు విలసిల్లగా విభుడను మహావీరుడు ఇంద్రుడైనాడు. ఆతని శత్రువైన శాంతశత్రుడను దైత్యుని శ్రీ మహావిష్ణువు హంస రూపంలో వచ్చి వధించాడు.
అరవ మనువు చాక్షుషుడు. అతని పుత్రులు ఊరు, పురు, సత్యద్యుమ్న, సత్యబాహు, కృతి, అగ్నిష్టు, అతిరాత్ర, నర, సుద్యుమ్నులు, నాటి సప్తర్షులు హవిష్మాన్, సుతను, స్వధాన, విరజ, అభిమాన, సహిష్ణు, మధుశ్రీ మహామునులు. ఈ చాక్షుష మన్వంతరంలో ఆర్య, ప్రసూత, భవ్య, లేఖ, పృథుకు నామక దేవగణాలు విలసిల్లినాయి, మనోజవుడు ఇంద్రునిగా ఎన్నుకోబడినాడు. దేవశత్రువు, దీర్ఘవాహుడునగు మహాకాలాసురుని శ్రీ మహా విష్ణువు హయరూపుడై వధించాడు.
ఏడవ మనువైన వైవస్వతుని పుత్రులు మహావిష్ణుభక్తులైన ఇక్ష్వాకు, నాథ, విష్టి శర్యాతి, హవిష్యంతి, సాంశు, నధ, నేదిష్ట, కరూశ, షృశాధ్ర, సుద్యుమ్నులు, మహాతపస్సంపన్నులైన అత్రి, వశిష్ట, జమదగ్ని, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు వైవస్వత మన్వంతరపు సప్తర్షులు, నలభైతొమ్మిది మరుద్గణాలు, ఆదిత్య, వసు, సాధ్య, మున్నగు ద్వాదశ దేవగణాలు వర్ధిల్లుతున్నాయి. పదకొండుగురు రుద్రులు, ఎనమండుగురు వసువులు, పదిమంది విశ్వేదేవులు, ఇద్దరశ్వనీ కుమారులు, పదిమంది అంగిరులు దేవగణాల్లోవున్నారు. ఇంద్రుని పేరు తేజస్వి, హిరణ్యాక్షుడను దేవశత్రువుని శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి సంహరించాడు.
ఇక రాబోయే మన్వంతరాలను గూర్చి వర్ణిస్తాను. మన వైవస్వత మన్వంతరం తరువాత రాబోతున్నది సావర్ణి మన్వంతరము, మనుపుత్రులు విజయ, ఆర్యవీర, నిర్మోహ, సత్యవాక్, కృతి, వరిష్ఠ, గరిష్ఠ, వాచ, సంగతులు. మహామునులైన అశ్వత్థామ, కృపాచార్య వ్యాస, గాలవ, దీప్తిమాన్, ఋష్యశృంగ, పరశురాములు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. సుతపా, అమృతాభ, ముఖ్య నామక మూడు దేవగణాలుంటాయి. ఒక్కొక్క గణంలో ఇరవైమంది దేవతలుంటారు. విరోచన పుత్రుడైన బలి చక్రవర్తి దేవేంద్ర పదవినందుకుంటాడు గానీ అతనికి అహంకారం పెరగడంతో విష్ణువే వామన రూపంలో వచ్చి అతని నుండి మూడడుగుల దానాన్ని గ్రహించి అడుగుకొక లోకంగా ముల్లోకాలనూ ఆక్రమిస్తాడు. బలి సిద్ధినీ మోక్షాన్నీ పొందుతాడు.
వరుణపుత్రుడైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువుగా వస్తాడు. అతని పుత్రులు దృతికేతు, దీప్తికేతు, పంచహస్తి, నిరామయుడు, పృథుశ్రవుడు, బృహద్యుమ్నుడు, ఋచీకుడు, బృహదుణుడు అనువారలు. ఈ మన్వంతరంలో మేధాతిథీ, ద్యుతి, సవస, వసు, హవ్య, కవ్య, విభులు సప్తర్షులు. పర, మరీచిగర్భ, సుధర్ము లింద్రులుగా ఎన్నికవుతారు. వారి ప్రధానశత్రువైన కాలకాక్ష దైత్యుని శ్రీ మహావిష్ణువు పద్మనాభుడై వధిస్తాడు.
No comments:
Post a Comment