Thursday, 20 June 2024

శ్రీ గరుడ పురాణము (211)

 


ఈ దేవతలూ పితరులూ కూడా ఒకనివల్ల సంతృప్తులైతే వానికి అన్ని శుభ, అభీష్టాలనూ ప్రసాదిస్తారు. ఏయే యజ్ఞ ప్రతిపాదిత వేదభాగాన్ని అధ్యయనం చేస్తామో ఆయా యజ్ఞ ఫలాలను పొందుతాము. అంతేకాక భూమి, దాన, తపస్సు, స్వాధ్యాయ ఫలాలను కూడా పొందగలము.

నైష్ఠికుడైన బ్రహ్మచారి తన ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలోనే వుండాలి. ఆయన లేకుంటే ఆ కుటుంబసభ్యుల వద్ద వుండాలి. వారంతా కలసి ఎక్కడికైనా పోయినపుడు తనచే ఉపాసింపబడు అగ్ని అనగా తన వైశ్వానరాగ్ని శరణంలో వుండాలి. ఈ రకంగా భోగాలను వదలి, మెదడును పెంచి, శరీరాన్ని కృశింపజేసుకొని జితేంద్రియుడై బ్రహ్మచర్యాశ్రమమున జీవించిన వానికి జన్మ చివర్లో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పునర్జన్మ వుండదు.


(అధ్యాయాలు - 93,94)


గృహస్థ ధర్మ నిరూపణం


యాజ్ఞవల్క్య మహర్షి ఇంకా ఇలా ప్రవచింపసాగాడు. యతవ్రతమునులారా! విద్యాధ్యయన సమాప్తి కాగానే బ్రహ్మచారి గురువుగారికి దక్షిణను సమర్పించి ఆయన అనుమతితో స్నానం చేసి బ్రహ్మచర్య వ్రతానికి వీడ్కోలు పలకాలి. తరువాత తల్లిదండ్రుల అనుమతితో గాని, గురువుగారి ఆదేశానుసారముగాని ఒక సులక్షణా, అత్యంతసుందరీ, మనోరమా, అసపిండా, వయసులో తనకన్న చిన్నదీ, అరోగా, భ్రాతృమతీ, భిన్న ప్రవర, గోత్రీకురాలూ నగు కన్యను వివాహం చేసుకోవాలి.


ఈ సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి సపిండ ఎవరో కూడా వివరించాడు. తల్లితో మొదలు పెట్టి ఆమె తండ్రి, తాత, ముత్తాత... అలా లెక్కపెడుతూ పోయి ఏడవతరం దాకా ఉండిన వారందరినీ సపిండ్యులుగా భావించాలి. ఈ మధ్యలో వరుని వంశంలో ఎక్కడ కలిసినా ఆమె సపిండ్యయే అవుతుంది. ఎక్కడా కలవనిదే అసపిండ కాగలదు. అసపిండనే పెళ్ళి చేసుకోవాలి. అలాగే ఆమె మాతృ వంశంలోనూ పితృవంశంలోనూ అయిదేసి తరాల దాకా విచారించి సదాచార, అధ్యయన, పుత్రపౌత్ర సమృద్ధి దృష్టిలో పెట్టుకొని వారి ఖ్యాతిని చూడాలి గాని ధనాన్ని బట్టి కాదు. ఇటువంటి కన్యను కల్యాణ మాడదలచుకొనే వరుడు కూడా సమానవర్ణుడూ, ఆమెకి తగినవాడునై వుండాలి.


No comments:

Post a Comment