అందరికీ అందరి ద్వారా కనిపించే మూర్త స్వరూపుడు, సూక్ష్మతమ స్వరూపుడు శ్రీహరి. అంటే కొండకంటే పెద్దవానిగానూ, చీమకంటే చిన్నవానిగానూ కనబడగలడు. జ్ఞానదృష్టి గల కర్ణేంద్రియానికి వినబడగలడు. జ్ఞానులకు విజ్ఞానమూ దివ్యదృష్టి గలవారికి పరమానంద స్వరూపము ఆయనే. విష్ణువును కనుగొనడానికి మామూలు జ్ఞానం చాలదు. తురీయ అనగా అత్యుత్తమ జ్ఞానం వున్నవాడికి ఆయన పరమాక్షర స్వరూపం తెలుస్తుంది. అన్ని ప్రాణుల ఆత్మ స్వరూపుడూ, సాక్షాత్కల్యాణ స్వరూపుడూ, శివమునిచ్చువాడూ, వికారహీనుడూ, వేదాంతవేద్యుడూ, వేదరూపుడూ, ఇంద్రియాతీతుడూ, భూతేశ్వరుడూ, శబ్ద రూప రస స్పర్శ గంధాలనెడి పంచతన్మాత్ర రహితుడైన అనాది బ్రహ్మమూ ఆయనే. ఈ శ్రీ మహావిష్ణువే పరమయోగి, పరమహంసల ద్వారా సంపుటిత బ్రహ్మరంధ్రంలో 'అహం బ్రహ్మస్మి' అనే భావానికి మూలమై పరిజ్ఞానమాత్రుడై వుంటాడు. జితేంద్రియుడై ఈ జ్ఞానాన్ని పొంది హరిని 'చూడ' గలిగిన ఏ మానవుడైనా పరబ్రహ్మస్వరూపుడు కాగలడు.
ఇక విష్ణుని -అనగా నా యొక్క మూర్తధ్యాన స్వరూపమును వినిపిస్తాను' అంటూ విష్ణువిలా వినిపించాడని సూతమహర్షి శౌనకాది మహామునులకు చెప్పసాగినాడు.
విష్ణువు కోటి సూర్య ప్రభాసంపన్నుడు, అద్వితీయ జయశీలుడు, కుందపుష్పగోదుగ్ధ సమాన ధవళ వర్ణుడు. మోక్షాన్ని కోరుకొనే మునీశ్వరులు ఇట్టి స్వరూపంలో నున్న శ్రీహరిని ధ్యానిస్తారు. ఆ స్వరూపం అత్యంత సుందరం. విశాలమైన శంఖంతో, సహస్ర సూర్యప్రభాకలితమై ప్రచండ జ్వాలామాలతో చుట్టబడిన ఉగ్రరూపం గల చక్రంతో, శాంత స్వభావం ప్రస్ఫుటమగుచున్న సుందరవదనంతో, రక్షణకే పుట్టినట్లుగా చేతిలో సిద్ధంగా నున్న గదతో విరాజిల్లే రూపమిది.
ఈ శ్రీ మహావిష్ణువు రత్నములతో దేదీప్యమానమైన బహుమూల్య కిరీటాన్ని ధరించి వుంటాడు. కమలాన్నీ ధరిస్తాడు. వనమాలాధారియై సమాన భుజస్కంధాలతో, స్వర్ణ భూషణాలతో, శుద్ద వస్త్రధారియై, విశుద్ధ దేహం సుందరకాంతులీనుచుండగా వెలుగులను విరజిమ్ముతూ సర్వకల్యాణకారకమైన కమలంపై నిలబడివుంటాడు.
శ్రీ మహావిష్ణువు స్వర్ణమయ శరీరుడై సుందర హారాలతో, శుభంకర భుజకీర్తులతో, రత్నకంకణ కేయూరాలతో, అలంకరింపబడి తన కాంతిలో అవి మెరుస్తుండగా, కౌస్తుభమణి ఒక వైపు, లక్ష్మీదేవి మరొకవైపు ఒదిగియుండగా శోభాయమాన నేత్రాలలో కరుణ తొణికిసలాడుతుండగా వెలుగులు విరజిమ్ముతుంటాడు.
No comments:
Post a Comment