Friday, 28 June 2024

శ్రీ గరుడ పురాణము (219)

 


ఇక గృహస్థధర్మాన్ని గూర్చి మాట్లాడుకుందాం.


గృహస్థు ప్రతిదినం స్మార్తకర్మా, వైశ్వదేవాది అగ్నికార్యాలూ సంపన్నం చేయాలి. దీనికి వివాహాగ్నిని కానీ సంపద్విభాగసమయంలో స్వయంగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కానీ ఆరాధించాలి. శ్రౌతకర్మానుష్ఠానానికి అగ్నిహోత్రం వైతానాగ్ని (ఆహవనీయ మున్నగు అగ్నులలో నేదో ఒకటి) తో సంపన్నం చేయాలి. శరీర చింతలను (విసర్జనాలను) ఉదయసాయం కాలాలలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి. గంధలేపనివృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతధావన, స్నానాదికములను గావించి ప్రతి ద్విజుడూ ప్రాతఃకాల సంధ్యో పాసనను ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి. హవనం చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను, అనగా ఉదుత్యం జాతవేదసం... మున్నగు వాటిని జపించాలి. తరువాత వేదార్థాలనూ అనగా నిరుక్త వ్యాకరణాదులనూ ఇతర శాస్త్రాలనూ అధ్యయనం చేయాలి. యోగ క్షేమాది సిద్ధికై ఈశ్వరో పాసనను కూడా చేయాలి. 

గృహస్థధర్మంలో మరొక ముఖ్యమైన అంశం తర్పణాలు. ప్రతి గృహస్థు ప్రతిరోజూ దేవతలకూ పితరులకు స్నానానంతరం తర్పణాలివ్వాలి. పూజ కూడా చేయాలి. వేదపురాణేతిహాసాలలో కొంతమేర, యథాశక్తి, పారాయణం చేయాలి. జపంచేసుకొని భూత, పితర, దేవ, బ్రహ్మ, మనుష్య జాతులకు బలికర్మ*ను గావించాలి.


(* భూతయజ్ఞం, స్వధా - పితృయజ్ఞం, హోమ- దేవయజ్ఞం, స్వాధ్యాయ- బ్రహ్మయజ్ఞం, అతిథి సత్కారం - మనుష్యయజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ బలికర్మగా వ్యవహరిస్తారు.)


తరువాత స్వధా, హోమ, స్వాధ్యాయ, అతిథి సత్కారాలు చేయాలి. దేవతలనుద్దేశించి అగ్నిలోహవనాలిచ్చి కుక్కలు, చండాలురు, కాకులు మున్నగు ప్రాణులకై వండిన అన్నాన్ని భూమిపై వేయాలి. పితృగణాలకూ మనుష్యులకూ అన్నంతో బాటు జలదానం కూడా చేయాలి. అన్నమును తన కుటుంబమునకు మాత్రమే సరిపడునంత వండుట సరికాదు. పక్వాన్న మెల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో వుండాలి. స్వవాసిని, (పెళ్ళయినా కూడా ఏవోకారణాలవల్ల ఆనాటికి పుట్టింట్లో వున్న స్త్రీ) వృద్ధులు, గర్భిణులు, వ్యాధి పీడితులు, కన్యలు, అతిథులు, భృత్యులు- వీరందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటి యిల్లాలు, ఇంటి యజమాని అగ్నిలో పంచప్రాణాహుతులనిచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చెయ్యాలి. భోజనానికి ముందూ వెనకా అవపోసన పట్టాలి.


No comments:

Post a Comment