Monday 17 June 2024

శ్రీ గరుడ పురాణము (208)

 


గర్భధారణ నుండిగాని జన్మగ్రహణ నుండి గాని లెక్కగట్టి ఎనిమిదవయేట బ్రాహ్మణునికీ, పదకొండవ వర్షంలో క్షత్రియునికీ, పన్నెండవ సంవత్సరంలో వైశ్యునికీ ఉపనయన సంస్కారాన్ని సంపన్నం చేయాలి. దీన్ని గురువు చేత గాని, వంశాచారాన్ని బట్టి కాని చేయించాలి. ఈ విధంగా ఉపవీతుడైన వటువుకు గురువు మహావ్యాహృతిసహిత వేదాన్ని చదివి చెప్పే శక్తి వచ్చేలా చెయ్యాలి. అలాగే శౌచాచార శిక్షని ప్రదానం చెయ్యాలి.


ద్విజులు పొద్దున్న సాయంత్రవేళల్లో ఉత్తరం వైపు తిరిగీ, అదే రాత్రయితే దక్షిణాభిముఖంగానూ మల విసర్జనం చేయాలి. తరువాత మలమూత్రాలు వాసన పోయేదాక మట్టితో నీటితో కడుక్కోవాలి. ఈ పనిని జలాశయ మధ్యంలో చేయరాదు. నూతుల వంటి వాటి వద్ద క్రింద చప్టాలపై కానివ్వవచ్చును. తరువాత శుద్ధస్నానానికి పోయి ఇరుపాదాలనూ శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత మోకాళ్ళపై చేతులనుంచి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని బ్రహ్మతీర్థాచమనము చేయాలి. (* కుడిచేతిలో బొటన వేలి మూలాన్ని బ్రహ్మతీర్ధమనీ, చిటికెన వేలి, చూపుడు వేలి మూలాలను క్రమంగా ప్రజాపతి, పితృతీర్థాలనీ, కరాగ్రభాగాన్ని దేవతీర్థమనీ వ్యవహరిస్తారు.)


కూప, తటాకాది శుద్ధజలాలతో మూడుమార్లు ఆచమనం చేసి అంగుష్ఠమూలంతో రెండుమార్లు పెదవులను స్పృశించాలి. స్నానం ద్వారా శుద్ధి చెందవలసి వచ్చినపుడు ద్విజులు నురగ, బుడగలు లేని నీటితో సర్వేంద్రియాలనూ శుభ్రపఱచుకోవాలి. నదిలోగాని మరే జలాశయంలోగాని గుండెదాకా దిగి బ్రాహ్మణులూ, గొంతు దాకా దిగి క్షత్రియులూ, తాలువుకి కొంచెం కింది దాకా దిగి వైశ్యులూ ఆచమనం చేసి శుద్ధులౌతారు. స్త్రీలూ, శూద్రులూ తాలువు దాకా దిగి ఆచమనం చేస్తే శుద్ధులౌతారు.


ప్రాతఃస్నానంలో జలదైవత మంత్రమైన ఓం ఆపోహిష్టా...ను పూర్తిగాపలుమార్లు పఠిస్తూ ఒళ్ళు తోముకోవడాన్ని పూర్తిచేసి జలాన్ని పోసుకుంటూ ప్రాణాయామ, సూర్యోపత్థాన, గాయత్రి మంత్ర పఠనం అనే పనులను కూడా చేసుకోవాలి.


No comments:

Post a Comment