Friday 30 August 2024

శ్రీ గరుడ పురాణము (279)

 


ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణభంగురాలు చాలానే వున్నాయి. వాటిని నమ్ముకొనరాదు.


ఆకాశాన్ని కమ్ముకునే మబ్బునీడా, గడ్డిమంటా, నీచుడి సేవాభావం, దారిలో కనిపించే నీరూ, వేశ్యలకు ప్రేమా, దుష్టుని మనసులో పుట్టే ప్రీతీ ఈ ఆరూ క్షణభంగురాలు. మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోరాదు. అలాగే మిగతా వాటినీ నమ్మరాదు.


అభ్రచ్ఛాయా తృణా దగ్నిర్నీచసేవా పథోజలం । 

వేశ్యారాగః ఖలే ప్రీతిః షడేతే బుద్బుదోపమాః ॥


(ఆచార .. 115-39)


బాల్యం తీరిన తరువాత నోరు పెట్టినా ఎవరూ పడరు. గౌరవం నోటిని బట్టి రాదు. బాలురకు మాత్రం రోదనమే బలం. నిర్బలులకు రాజే బలం. మూర్ఖునకు మౌనం బలం. దొంగకి అసత్యమే బలం. మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తూ వుంటుంది. మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది. అలాగే మనిషి జగత్కల్యాణం వైపు మనసును మళ్ళించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి, మనసు విశాలమై మరిన్ని మంచిపనులు చేయాలనిపిస్తుంది. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన ఉత్తరక్షణంలోనే దానిని అమలులో పెట్టెయ్యాలి.


యథాయథా హి పురుషః శాస్త్రం సమధి గచ్ఛతి!

తథా తథా స్యమేధా స్యాద్వి జ్ఞానంచాస్య రోచతే ॥

యథా యథా హి పురుషః కల్యాణే కురుతే మతిం |

తథా తథా హి సర్వత్ర శిష్యతే లోక సుప్రియః ॥ (ఆచార.. 115/42,43) 


లోభం ఎలాగూ మంచిదికాదు. ఒక్కొక్కప్పుడు చిన్నపొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి. కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా వుండడం మంచిదేకాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి.


ఋణశేషం అగ్నిశేషం వ్యాధిశేషం ఉంచినకొద్దీ ఋణాగ్ని వ్యాధులు పెరిగిపోతునే వుంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి. 


ఋణశేషం చాగ్నిశేషం వ్యాధిశేషం తథైవచ ।

పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్ఛేషం న కారయేత్ ॥


(ఆచార .. 115/46)


మనతో కలిసి వుండి మిత్రుని వలె నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నిటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవానిని అసలు విషయం తెలియగానే తన్ని తగిలెయ్యాలి. మాయావియైన శత్రునివలె.


పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం | 

వర్ణయేత్ తాదృశం మిత్రం మాయామయ మరింతథా|| (115/48)


No comments:

Post a Comment