Tuesday 20 August 2024

శ్రీ గరుడ పురాణము (270)

 


మునులారా! ఎవరూ ఎవరికీ పుట్టుకతోనే మిత్రులుగానీ శత్రువులు గానీ కారు. కారణంవల్లనే ఆ బంధాలేర్పడుతున్నాయి. ఈ 'మిత్ర' శబ్దం అక్షర రూపంలోనున్న రత్నమే. ఈ శబ్దం మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది. ప్రాణికోటికి ప్రేమను కురిపించేవాడూ విశ్వాసాన్ని చూపించేవాడూ మిత్రుడొక్కడే. స్వార్థం లేని బంధం కూడా ఇదొక్కటేనేమో!


ఇంతకన్న పవిత్రమైన శబ్దం 'హరి'. ఈ శబ్దానుచ్చరించేవాడు బట్టలు వేసుకొని బత్తాములు పెట్టుకొని బయటికి బయలుదేరినంత సుఖంగా మోక్షపదవినందడానికి లోకం నుండి పైకి వెళతాడు.


సకృదుచ్ఛరితం యేన హరిరిత్యక్షర ద్వయం | 

బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి ॥


(ఆచార ... 114/3)


అన్ని విధాలా తన తోటివాడేయైన మిత్రుని మీద వున్న నమ్మకం మనకి తల్లిదండ్రుల మీద భార్యాపుత్రుల మీద కూడా వుండదు. మిత్రత్వాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోదలచుకున్నవారు ఒకరితో నొకరు జూదమాడకూడదు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు, ఒకరి భార్యకింకొకరు దూరంగా వుండాలి.


మధుర పదార్థాల ద్వారా చిన్నపిల్లలనూ, వినమ్రభావంతో సజ్జన పురుషులనూ, ధనం ఇస్తానని చెప్పి స్త్రీనీ, తపస్సు చేసి దేవతలనూ, చక్కని, కమ్మని మాట తీరును చూపించి (అనగా సద్వ్యవహార విశేషాన) సమస్తలోకాన్నీ వశపఱచుకోగలిగినవాడే నిజమైన పండితుడు.


కపటం ద్వారా మిత్రులనూ, పాపపు సొమ్ము ద్వారా ధర్మాన్నీ, ఇతరులను పీడించి ధనాన్నీ, పెద్దగా శ్రమించకుండా సుఖంగా విద్యనూ, కఠోర వ్యవహారం ద్వారా క్రూరంగా భయపెట్టి స్త్రీనీ వశం చేసుకోదలచినవాడు వివేకవంతుడు కాడు. ఇవేవీ తెలివైన పనులు కావు. ఆ కపటం, ఆ భయం, ఆ ధనం, ఆ బలం పోగానే ఆయా సంపదలూ పోతాయి.


పండ్లకోసం చెట్టును పెకలించేవాడు దుర్భుద్ది. ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలేగాని చెట్టుని నాశనం చేయడం అవివేకం. 


No comments:

Post a Comment