Wednesday 21 August 2024

శ్రీ గరుడ పురాణము (271)

 


నమ్మకూడని వానిని నమ్ముకోకూడదు. లోకంలో అందరి నమ్మకాన్ని వమ్ము చేసినవాడు తనకు మాత్రం నమ్మకస్తుడెలా అవుతాడు? ఆ మాటకొస్తే మిత్రుని కూడా అతిగా విశ్వసించరాదు.


న విశ్వసే దవిశ్వస్తే మిత్రస్యాపి న విశ్వసేత్ |

కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ ॥ (ఆచార... 114/22)


మిత్రునికి కోపం వస్తే మన రహస్యాలు బయటపెట్టే ప్రమాదముంది కావున ఎవరినీ నమ్మవద్దని సామాన్యులకు పెద్దలు చెప్తారు కానీ అన్ని ప్రాణులనూ విశ్వసించడం, అన్నింటి పట్లా సాత్త్వికభావాన్నే కలిగియుండడం, తమదైన సాత్త్విక స్వభావాన్ని యెల్లవేళలా సంరక్షించుకోవడం సజ్జన పురుషుల లక్షణాలు.


దరిద్రునికి 'గోష్ఠి' అనేది విషంతో సమానం. (గోష్ఠి అంటే నేటి పార్టీలిచ్చుట) అలాగే వృద్ధునికి నవయువతీ సంగమం, మిడిమిడి జ్ఞానంతో ఆపేసిన చదువు, అజీర్ణంగా నున్నపుడు చేసే విందు భోజనం కూడా విషంతో సమానాలే.


మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి ఆరు కారణాలుంటాయి. ఎక్కువగా నీరు త్రాగుట, అతిగా తినుట, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చి వేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ- వీటిలో ఒక్కటి చాలు... శరీరం లోకి రోగం ప్రవేశించడానికి.


తెల్లవారకుండానే వేసే ధూపం, అతిగా రతి, శ్మశానం పొగలను పీల్చుట, అగ్నిలో చేతిని పెడుతూ తీస్తూ ఆడుట, రజస్వలతో సంభాషణ - ఇవి దీర్ఘాయుష్కుల ఆయువునే తగ్గించే శక్తి కలిగి వుంటాయి. ఇలాగే ఆయువును నాశనం చేసేవి మరో ఆరున్నాయి: ఎండిన మాంసం, వృద్ధ స్త్రీ, బాలసూర్యుడు, రాత్రి పెరుగు సేవనం, ప్రభాతకాలంలో మైథునం మరియు నిద్ర.


అప్పుడే తయారైన నెయ్యి, ద్రాక్షపండ్లు, వయసులో నున్న స్త్రీ, పాలు, వేడినీరు, చెట్టు నీడ - వీటిని అనుభవించగానే ప్రాణశక్తి బలపడుతుంది. నూతినీరు, మఱ్ఱి చెట్టు నీడ శీతాకాలంలో వెచ్చగానూ వేసవిలో చల్లగానూ వుంటాయి. తైలమర్దనం, సుందర భోజనం పొందగానే శక్తి కలుగుతుంది. మార్గాయాసం, మైథునం, జ్వరం తాత్కాలికంగా మనిషిని నీరసపెడతాయి.


మాసిన బట్టలు ధరించేవారు, పళ్ళు శ్రద్ధగా తోముకోనివారు, అధికంగా తినేవారు, కఠోరంగా మాట్లాడేవారు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు సాక్షాత్తూ విష్ణు సమానులైనా సరే వారికడ లక్ష్మి నిలువదు.


కుచైలినం దంతమలోపధారిణం 

బహ్వాశినం నిష్ఠుర వాక్య భాషిణం ! 

సూర్యోదయే హ్యస్త మయే పిశాయినం 

విముంచతి శ్రీరపి చక్రపాణిం ॥ 


తన గోళ్ళతో గడ్డిని చీల్చువాడు, నేలపై వ్రాసే వాడు, కాళ్ళు కడుక్కోనివాడు, దంతాలను స్వచ్ఛందంగా ఉంచుకోనివాడు, నగ్నంగా శయనించువాడు, భోజన పరిహాసాలతిగా చేయువాడు, తన అంగాలపై ఆసనంపై మద్దెల కొట్టుకొనువాడు, కేశసంస్కారం చేసుకోనివాడు, ప్రాతస్సాయం సంధ్యలలో నిదురించువాడు, కుచైలుడు - ఇలాంటి వారి కడకూడా లక్ష్మి నిలువదు. 


No comments:

Post a Comment