నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే ప్రయత్నిస్తుంటాడు. మధ్యముడు ఎక్కువగా సంధికోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవపడడు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనముకదా! సన్మానమే వుంటే ఇక ధనమెందుకు? మానమూ దర్పమూ నశించినవానికెంత ధనముండి ఏమి లాభము? వాడు జీవించుట మాత్రము దేనికి? మాన, స్వాభిమాన యుగళము లేక ధన, ఆయుర్యుగళ ముండీ లేనట్లే కదా!
నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యముడు ధన, మానాలు రెండూ కావాలంటాడు. ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు.
అధమాధన మిచ్ఛంతి ధనమానౌహి మధ్యమాః ।
ఉత్తమా మానమిచ్ఛంతి మానోహి మహతాం ధనం ॥
(ఆచార 115/13)
అడవిలోని సింహానికెంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన జంతు లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలూ అలాగే లభిస్తాయి.
నాభిషేకో న సంస్కారః
సింహస్య క్రియతే వనే |
నిత్య మూర్జిత సత్త్వస్య
స్వయమేవ మృగేంద్రతా ||
బద్ధకస్తుడైన వర్తకుడు, అహంకారియైన సేవకుడు, కటువుగా మాట్లాడే వేశ్యా తమ వృత్తులలో రాణించలేరు.
దరిద్రుడై వుండీ దాత కావాలనే కోరికా, ధనికుడై యుండీ పీనాసితనమూ, అతి గారాబం చేసి కొడుకుని చెడగొట్టుకోవడమూ, మంచివాడై వుండి దుష్టులను సేవించడమూ, ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడమూ మనిషిని దుశ్చరిత్రుని చేసే పంచలక్షణాలు.
దాతా దరిద్రః కృపణో- ర్దయుక్తః పుత్రో- విధేయః కుజనస్యసేవా ।
పరాపకారేషు నరస్య మృత్యుః ప్రజాయతే దుశ్చరితాని పంచ ॥
కాంతా వియోగః స్వజనాప మానంఋణస్యశేషః కుజనస్య సేవా ।
దారిద్య్ర్య భావాద్విముఖాశ్చ మిత్రా వినాగ్నినా పంచదహంతి తీవ్రాః ॥
(ఆచార 115-17,18)
అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి అయిదుంటాయి. అవి పత్నీవియోగం, స్వజనులే చేసే అవమానం, మిగిలిపోయిన ఋణం, దుర్జనులను సేవించవలసిరావడం, ధనహీనత వల్ల మిత్రులు పెడమొగమై పోవడం.
No comments:
Post a Comment