Sunday, 18 August 2024

శ్రీ గరుడ పురాణము (268)

 


దుష్టస్వభావులు, ఆత్మవంచకులు, వంచకులు అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే చేసేవారు ఎన్నిమార్లు పుట్టమన్ను నంటించి మరీ శరీరాన్ని తోముకున్నా పవిత్రులు కానేరరు. చేతులు, పాదాలు, మనస్సు మకిలి లేకుండా వున్నవారు, ధర్మపాలకులు, ఆధ్యాత్మ విద్యా సంపన్నులు, సత్కీర్తి నార్జించినవారు తీర్థాలలో మునగక పోయినా పవిత్రులుగానే వుంటారు. తీర్థఫలాన్నీ అందుతారు.


యస్యహస్తాచ పాదౌచ మనశ్చైవ సుసంయతం |

విద్యాతపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే ॥


(ఆచార ...113/41)


సన్మానానికి పొంగిపోకుండా, అవమానానికి కోపించకుండా, ఎదుటివాడు కోపం తెప్పించడానికెంత ప్రయత్నించినా పరుషవాక్కు లాడకుండా వుండేవానినే సాధు పురుషుడంటారు.


నప్రహృష్యతి సమ్మానైర్నావమానైః ప్రకుప్యతి ।

నక్రుద్దః పరుషం బ్రూయాదేతత్ సాధోస్తు లక్షణం ॥


(ఆచార ...113/42)


మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అది ఫలించకపోతే బాధపడరాదు. కోపం తెచ్చుకోరాదు. విద్వాంసుడూ మధురభాషీ యైన వ్యక్తి దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకై ప్రయత్నించినా అతని దారిద్య్రం తీరకపోవచ్చు. బుద్ధి, పౌరుషం, బలం, మంత్రశక్తీ వుండి కూడా అలభ్య- అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి, ఒక వ్యక్తి భంగపడవచ్చు. నిరాశచెందరాదు.


అయాచితంగా వచ్చిన దానిని అనుభవించి అది పోయినపుడు విపరీతంగా బాధపడిపోవడం అనవసరం. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే పోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది. బాగా పెరిగిన చెట్టు పై కొన్నివందల పక్షులు రాత్రంతా కాపురముంటాయి. తెల్లారగానే పోతాయి. ఒకవేళ ఆ చెట్టు కూలిపోతే అవి దుఃఖిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ కూర్చోవు. ఈ మాత్రం ఇంగితం మనిషికెందుకుండదో?


శౌనకాచార్యా! పుట్టడానికి పూర్వం మనకేమీలేదు. గాలిలో ఎగురుతూ వచ్చాం. అలాగే పోయిన తరువాత కూడా మనకేమీ వుండదు. మనకున్నవన్నీ మధ్యలో వచ్చి పోయేవేగా!


అవ్యక్తా దీని భూతాని వ్యక్తమధ్యారి శౌనక | 

అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా ॥


(...113/48)


పోయేకాలం వచ్చినవాడు సూదిగుచ్చుకున్నా పోతాడు. అది రానివాడు అంటే ఇంకా ఆయువున్నవాడు యుద్ధంలో శరీరం నిండా సందు లేకుండా బాణాలు కూరీసినా బతికేస్తాడు. కాబట్టి చావుకి భయపడనక్కరలేదు. అలాగే ఎవరికెంత ప్రాప్తమో అంతే వస్తుంది, వుంటుంది. ప్రాప్తించిన దానికి సంతోషించరు కానీ అప్రాప్య వస్తువుకై అంగలారుస్తారు, అలమటిస్తారు. ఇది అనవసరం. ప్రయత్నం మంచిదే; దుఃఖం కాదు.


వృక్షాలు ఏ పూజలు చేశాయని, ఏ ప్రార్థనలు సలిపాయని వాటికి సమయం వచ్చేసరికి పూత, కాత, పంట వస్తున్నాయి? మానవులకు కూడా పూర్వ జన్మ పుణ్య, పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి. పూజలు, ప్రార్థనలు మనిషికి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ వచ్చే ఫలాల విషయంలో మార్పులు తేగలవు. శీలం, వంశం, విద్య, జ్ఞానం, గుణం, శుద్ధత- ఇవేవీ పూర్వకర్మమును మార్చలేవు. పూర్వజన్మతపః ఫలమే చెట్టుకి సర్వాంగ శోభనిచ్చినట్లు మనిషికి సర్వాంగసౌందర్యాన్నీ, అన్ని సంపదలనూ ఇస్తుంది.


No comments:

Post a Comment