పొరపాటున కూడా దుష్టునీ, శత్రవునీ ఉపేక్షించకూడదు. వాళ్ళు అల్పులే, పరవాలేదు అనుకోకూడదు. చిన్న నిప్పురవ్వే బ్రహ్మాండమును భస్మము చేయగలదని మరువరాదు.
యౌవనంలో కూడా శాంతంగా వుండగలవాడే నిజమైన శాంత స్వభావి. అన్నీ అయిపోయినవాడూ, శక్తులన్నీ ఉడిగిపోయినవాడూ శాంతుడు కాక చేసేదేముంటుంది?
నవే వయసి యఃశాంతః సశాంత ఇతి మేమతిః ।
ధాతుషుక్షీయమాణేషు శమః కస్య న జాయతే ॥
(ఆచార ... 114/73)
సంపదలన్నీ భగవంతుడివీ, ఆయన ప్రసాదించిన ప్రకృతివీనీ.
'ఈ సంపదంతా నాది' అని ఏ మనిషి భ్రమపడరాదు. (అధ్యాయాలు-113, 114)
నీతిసారం
వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నినీ, దుష్టమిత్రునీ, దురాచారియైన రాజునీ, కుపుత్రునీ, గుణహీనకన్యనీ, కుత్సిత దేశాన్నీ దూరం నుండే పరిత్యజిస్తాడు.
కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత వుండదు; మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుష్యులు కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు; బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు; పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు; స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల, అందచందాల ఆసరాతో లోకాన్నే ఒక ఆట ఆడిస్తుంటారు.
కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గల వారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్నేలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు పట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది. పోయినవాళ్ళే ధన్యులనిపిస్తుంది. ఉన్నవాళ్ళు పోయిన వారికి తీపి గురుతులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ‘ఆహా! మృతులెంత అదృష్టవంతులో కదా! ఈ అరాచకాన్నీ, ఈ దేశం ముక్కలైపోడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాసక్తలైన పత్నులనీ, దురాచారాసక్తులైన పుత్రులనీ చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో వున్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే వుండివుంటారు అని వృద్ధులంతా తమలో తాము, తమతోతాము సంభాషించుకొంటుంటారు.
No comments:
Post a Comment