Thursday 29 August 2024

శ్రీ గరుడ పురాణము (278)

 


నూరేళ్ళ జీవితం గొప్పనుకుంటాం కానీ ఈ నూరేళ్ళూ దేనికీ చాలదు. ఇందులో సగభాగం నిద్రలోనే గడచిపోతుంది కదా! మిగిలిన దానిలో సగభాగం వ్యాధి, దుఃఖం, వృద్ధాప్యంలచే తినివేయబడుతుంది. ఇక మిగిలిన దానిలోనే బాల్యము, ఇష్టజన వియోగ దుఃఖము లాంటి వన్నీ వుంటాయి కదా! ఇక జీవిక అనగా కొలువు. తిండికోసం పనిచేసే సమయం, దానిలోని సాధకబాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి. కాబట్టి మనకి ఉన్న సమయంలోనే ధర్మాన్ని దైవకర్మాల్నీ ఆచరించాలి. అంతేకాని, దానికి 'చాలా వేళ వుందిలే' అనుకోకూడదు అని ఊరుకోకూడదు. సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతిక్షణం ఆయువును తినేస్తుంటుంది. అందుకనే మనం వయసు పెరుగుతోందని సరదాపడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్తపడాలి. 'యవ్వనవేళ' లోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి.


మనిషికీ పశువుకీ గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్నా, ఆగివున్నా, మేలు కొనివున్నా, నిద్రలోనైనా లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం. ఆ ప్రసక్తే లేనిది పశుధర్మం. తన తిండి తాను తింటూ తన కోసం, తన పరిధిలోని జనాలకోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికీ పశువుకీ పెద్దగా తేడా వుండదు. పశువు కూడా పిల్లలకి పాలిస్తుందిగా!


గచ్ఛ తస్తిష్ఠతో వాపి జాగ్రతః స్వపతో నచేత్ । 

సర్వసత్త్వ హితార్థాయ పశోరివ విచేష్టితం ॥


హితమేదో కానిదేదో తెలియకుండానే గొప్ప వాడైపోయి, వేద, పురాణ, శాస్త్ర చర్చలవేళల్లో తర్క- వితర్కాలను రెచ్చిపోయి చేసేస్తూ, తన కడుపు నిండగానే తనివితీరి పోయిందనుకునే వాడికీ పశువుకీ ఏమి తేడా వుంది? వీడు వాగుతాడు, అది వాగలేదు. వీనిలో ఏ వైశిష్ట్యమున్నదని వీనిని పశువుకంటె భిన్నుడనుకోవాలి.


పరాక్రమం, విద్య, అర్థలాభములతో బాటు తపస్సు, దానబుద్ధి కూడా గలవాడై ప్రపంచంలో కీర్తి సంపాదించనినాడు ఆ మనిషికీ ఆతని మాత విసర్జించే మలానికీ, సమాన ప్రయోజనమే వుంటుంది. విజ్ఞానము, పరాక్రమం, యశము, అక్షుణ్ణ సమ్మానయుక్తమునగు జీవితాన్నెవడైతే ఒక ఏడాదిపాటైనను గడపగలడోవాడే మనిషిగా బతికినట్లు విజ్ఞులు గుర్తిస్తారు. వానిది భాగ్యవైభవము, వాని దవంధ్య జీవనము అంటూ కవులు కీర్తిస్తారు.


కాకివలె బతికి ఏమి లాభం? హంస వలె గానీ సింహమువలె గానీ జీవించవలె. కాకి పెంటను తిని బతుకుతుంది. ఎన్నేళ్ళయినా వుంటుంది. ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులనూ, భృత్యులనూ ధనంతో కంటె ప్రేమతో కట్టిపడవేయ గలిగినవానిదే మానవ జీవనమవుతుంది. మనిషికి ముందు తన పట్ల తనకి గౌరవ భావముండాలి. ఆత్మాభిమాన ముండాలి గాని అహంకారముండకూడదు. భూతదయ లేనివాడు, మిత్రులకు మంచి పనులలో పెద్ద మనసుచేసుకొని సాయపడనివాడు ఎంత ధనవంతుడైనా సరేవాడు పోయిన నాడు ఊరి ప్రజలు 'మొన్న ఒక కాకి పోయింది. నేడు ఈయన పోయాడు. ఊరికి ఒరిగిందీ లేదు తరిగిందీ లేదు' అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్ధం లేదు.


యో వాత్మనీహ నగురౌ నచ భృత్యవర్గే 

దీనే దయాం నకురుతే నచ మిత్ర కార్యే । 

కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే 

కాకో-పి జీవతి చిరం చ బలించ భుంక్తే ॥ 

స్వాధీన వృత్తేః సాఫల్యం న పరాధీన వర్తితా | 

యే పరాధీన కర్మాణో జీవంతో-పి చతే మృతాః ॥


స్వాతంత్య్రమే స్వర్గలోకం. పరాధీనులై జీవించువారు మృతకల్పులు (ఆచార.. 125/35,37)

No comments:

Post a Comment