Thursday 22 August 2024

శ్రీ గరుడ పురాణము (272)

 


తలంటి విరళంగా పోసుకోవడం, పాదాలు అవసరం మేరకు కడుక్కుంటుండడం, వేశ్యను సంపూర్ణంగా వర్ణించడం, శరీరమంతా శుభ్రంగా వుంచుకోవడం, అల్పంగానే తినడం, నగ్నతలేకుండా శయనించడం- ఈ పనులన్నీ చేయువాని వద్దకు లక్ష్మి వచ్చి చేరుతుంది.


బాలసూర్యుని తేజం, రగులుతున్న చితి యొక్క పొగ, వృద్ధ (తనకంటే పెద్ద) స్త్రీ సాంగత్యం, చీపురు నుండి వచ్చే దుమ్ము ఇవన్నీ ఆయుక్షీణాలు.


ఏనుగు, గుఱ్ఱం, రథం, గోవు, ధాన్యంల నుండి రేగే ధూళి శుభకరమే కాని గాడిద, ఒంటె, గొట్టె, మేక నడిచినపుడు రేగే ధూళి అశుభకరం. ముఖ్యంగా ఆవు, ధాన్యము, పుత్రుని అంగముల నుండి వచ్చు ధూళి కల్యాణకారి, మహాపాతక వినాశిని.


దేన్నయినా చేటతో విసురుతున్నపుడు వచ్చే గాలి, గోటి నీరు, స్నానం చేశాక గుడ్డ దులిపినపుడు చిలికే జలం, తల వెంట్రుకల నుండి జారే నీరు, చీపురు ధూళి బహు చెడ్డవి. ఇవి ఆర్జిత పుణ్యాన్నంతటినీ నశింపజేయగలవు. బ్రాహ్మణునికీ, అగ్నికీ, గుఱ్ఱానికీ ఎద్దుకీ, ఇద్దరు బ్రాహ్మణులకీ, ఆలుమగలకి, యజమాని దంపతులకీ మధ్య నుండి వెళ్ళరాదు.


విశ్వసించకూడనివారిని అసలు విశ్వసించనేకూడదు. నమ్మదగినవారిని కూడడా అతిగా పూర్తిగా నమ్మకూడదు. దీనివల్ల అంటే నమ్మడం వల్ల ఒక విలక్షణమైన భయం పుట్టుకొస్తుంది. అది మన సుఖాలన్నింటినీ నాశనం చేస్తుంది. శత్రువుతో సంధి చేసుకోవచ్చు గానీ వానిపై విశ్వాసముంచుట చిటారుకొమ్మ మీద నిద్రపోవడం వంటిదే.


నవిశ్వసే దవిశ్వస్తం విశ్వస్తం నాతి విశ్వసేత్ !

విశ్వాసాద్భయముత్పన్నం మూలాదపి నికృంతతి ॥

వైరిణా సహసంధాయ విశ్వస్తో యది తిష్ఠతి |

సవృక్షాగ్రే ప్రసుప్తోహి పతితః ప్రతిబుద్ధ్యతే ॥


(ఆచార ... 114/47,48)


పడిపోయాకే తెలుస్తుంది పడిపోయానని.


అత్యంత కాఠిన్యమూ, అలవి మీరిన మెత్తదనమూ రెండూ తప్పే. బలహీన కాండములు గల మొక్కలను శ్రమలేకుండా నరకవచ్చు. మహావృక్షాలు ఒకపట్టాన లొంగవు.


మనం ఆహ్వానించకపోయినా దుఃఖాలు వస్తాయి; వాటంతట అవే పోతాయి కూడ. సుఖాలు కూడా అంతే. సాధారణంగా సజ్జన పురుషులు సుఖపడతారు. దుష్టులకు దుఃఖాలు తప్పవు. కాబట్టి సజ్జనులుగానే జీవించాలి.


రహస్యం నాలుగు చెవుల మధ్యనే వుండాలి. ఆరో చెవి దాకా వెళితే అది రహస్యం కాబోదు. భవిష్యద్ వ్యూహాలూ రెండు చెవుల మధ్యనే అనగా ఒక మనిషి బుఱ్ఱలోనే వున్నంతకాలం అవి బ్రహ్మకు కూడా తెలియవు.


షట్కర్లో భిద్యతే మంత్రశ్చతుః కర్ణశ్చ ధార్యతే |

ద్వికర్ణ స్యతు మంత్రస్య బ్రహ్మాప్యంతం నబుధ్యతే ॥


(ఆచార ...114/54)

No comments:

Post a Comment