Tuesday 13 August 2024

శ్రీ గరుడ పురాణము (263)

 


రాజనీతి


(ఇది ఆ రోజులలో రాజుకి పనికివచ్చిన నీతి. ఇపుడు రాజులు లేరు. అయినా రాజాధికారాలుగల వారున్నారు. ప్రభుత్వముంది. కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులవసరం)


ప్రజలనుండి పన్నులరూపేణా డబ్బు వసూలు చేయడం తోటమాలి మృదువుగా తాను పెంచిన మొక్క నుండి *పూలు కోసినట్లుండాలి. అంతేకాని వంట చెఱకు కోసం చెట్టు నరకినట్లుండకూడదు.


* ఈ భావాన్నే పువ్వులోంచి తుమ్మెద తేనెను లాగినంత మృదువుగా నొప్పి లేకుండా ప్రజల నుండి ప్రభుత్వము పన్నులు వసూలు చేయాలని చెప్పాడు. అర్ధశాస్త్రంలో చాణక్యుడు. (గరుడపురాణంలో కూడా వుంది 123/5)


ఇతర రాజ్యాల నుండి వచ్చిన ద్రవ్యాలను రాజు స్వీకరించాలి. అవి పాడైపోతే, విరిగిన పాలనువలె, త్యజించాలి. పాల కోసం ఆవుని వాడుకోవాలిగాని పొదుగును కోసివేయకూడదు. అలాగే రాజు ధనికులనూ వాడుకోవాలి.


సత్యం మనోరమాః కామాః సత్యం రమ్యా విభూతయః । 

కింతువైవనితాపాంగ భంగి లోలంహి జీవితం ॥

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ 

రోగాశ్చ శత్రవ ఇవ ప్రభవంతి గాత్రే । 

ఆయుః పరిస్రవతి భిన్నఘటా దివాంభో 

లోకోన చాత్మహితమాచరతీహ కశ్చిత్ ॥


(ఆచార ...111/9,10)


అన్నీ సత్యంలాగా శాశ్వతంలాగా కనిపిస్తాయి. కాని ఐశ్వర్యం, భోగాలు, స్త్రీ, ప్రేమ, పదవి వంటివి సత్యాలూ కావు నిత్యాలూ కావు. అసలు కనిపించని రోగం, ముసలితనం, మృత్యువు మాత్రమే నిత్య సత్యాలు, శాశ్వతాలు, కాబట్టి రాజైనా ప్రజలైనా ధర్మాచరణ రక్తులై జీవించాలి.


పరస్త్రీలలో తల్లినీ, పరద్రవ్యంలో మట్టినీ, సర్వప్రాణులలో తన ఆత్మనూ చూడగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు.


పదవికోసం ప్రయత్నించేవాడు ఆ పనిని ప్రజలకోసం చేయడు. తన కోసమే చేస్తాడు. అది క్షంతవ్యమే కాని ఆ పదవి వల్ల వచ్చిన అధికారాన్నీ ఐశ్వర్యాన్నీ ప్రజోపయోగకరమైన యజ్ఞయాగాదులకూ దానాలకూ వినియోగించినవాడే నరకానికి పోకుండా వుంటాడు. (రాజ్యాంతే నరకం, ధ్రువం- అనే నానుడి వానికి వర్తించదు)


No comments:

Post a Comment