ఏ క్షణాన, ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది. మరోటి, మరోలా జరగదు.
యస్మిన్వయసి యత్కాలో యద్దివాయచ్చ వా నిశి
యన్ముహూర్తే క్షణేవాపి తత్తథా న తదన్యథా ||
(ఆచార ...11/22)
భగవంతుడు మనకివ్వని దానిని అప్రదత్తమంటారు. మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు, భూగర్భంలోనైనా ప్రవేశింపవచ్చు, దశదిశలనూ మోయగలగ వచ్చు కాని అప్రదత్త వస్తువును పొందలేము.
పురాధీతా చయా విద్యా పురావత్తశ్చ యద్ధనం
పురాకృతాని కర్మాణి హ్యగ్రే ధావతి ధావతి ॥
(ఆచార ... 113/24)
మనకబ్బిన విద్యా, మనను చేరిన ధనము కూడా పూర్వజన్మకృత పుణ్యఫలాలే. మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనను అనుసరిస్తూనే వుంటాయి.
అన్ని శుభలక్షణాలూ వుండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి సీతవంటి భార్య, భరత సౌమిత్రుల వంటి తమ్ములు ఉండి కూడా వారూ, శ్రీరాముడూ "పదునాలుగేళ్ళ పాటు సుఖపడలేదు. ఇక సామాన్యుల గతి ఏమి? ఇదీ పురాకృతమనగా,
కర్మణ్యత్ర ప్రధానాని సమ్యగృక్షే శుభగ్రహే ।
వనిష్ఠకృత లగ్నేఽ పి జానకీ దుఃఖభాజనం ॥
స్థూల జంఘోయదారామః శబ్ద గామీ చలక్ష్మణః |
ఘన కేశీయదాసీతా త్రయసే దుఃఖభాజనం ॥
*ఇక్కడ శ్రీరాముడు పూర్వజన్మలో చేసిన పాపమేమిటని అనుమానం కావచ్చు. శ్రీరాముడు విష్ణువు. విష్ణువు అంబరీషుని శరీరంలో ప్రవేశించి దుర్వాసుని ద్వారా పుడమి పై పుట్టాలనే శాపాన్ని పొందాడు. రావణుని అదేశించి అత్మలింగానికి బదులు తనను కోరేలా చేసినందుకు పార్వతీదేవి విష్ణువుని భార్యా వియోగంతో బాధపడుమని శపించింది.
నపితుః కర్మణా పుత్రః పితా వా పుత్ర కర్మణా !
స్వయంకృతే న గచ్ఛంతి స్వయం బద్ధాః స్వకర్మణా ॥ (ఆచార... 113/25-27)
మునులారా! ఇందులో ఇంకో విశేషంకూడా వుంది. తండ్రి పాప పుణ్యాలలో కొడుకుకి గానీ కొడుకు పాపపుణ్యాలలో తండ్రికి గానీ వాటా వుండదు. ఈ దేశంలో వుంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడతాయనుకోవడం భ్రమ. మనిషి ఎక్కడ పుట్టినా ఆ పాపం దుఃఖ రోగరూపంలో కట్టి కుడుపుతుంది.
ప్రాప్తవ్యమర్థం లభతేమనుష్యో
దేవోఽ పి తం వారయితుం న శక్తః |
అతో న శోచామి న విస్మయో మే
యదస్మదీయం నతు తత్పరేషాం ॥
(ఆచార ... 113/32)
సర్పము, ఎలుక, ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు? పుట్ట, కన్నం, అడవి... అంతదాకానే కదా! అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే వుంటుంది. మనం కర్మను దాటిపోలేము.
నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంటుంది. సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. ధర్మమార్గంలో సంపాదించిన ధనమే ధనం. అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను మిగలదు గానీ ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది.
సత్యపాలనం, మనఃశుద్ధి, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, జలప్రక్షాళన ఇవి పంచశుచి మార్గాలు. సత్యపాలన శుచి గలవానికి స్వర్గప్రాప్తి సులభమే. సత్యమునే మాట్లాడువాడు అశ్వమేధ యాగం చేసినవానికన్నా గొప్పవాడు.
సత్యం శౌచం మనఃశౌచం శౌచమింద్రియ నిగ్రహః ।
సర్వభూతేదయా శౌచం జలశౌచంచ పంచమం ॥
యస్య సత్యం హి శౌచం చ తస్య స్వర్గో న దుర్లభః |
సత్యం హి వచనం యస్య స్యోఽ శ్వమేధాద్విశిష్యతే ॥ (ఆచార... 113/38,39)
No comments:
Post a Comment