చెప్పిన పనిని అక్షరాలా మనసా చేసేవాడే సేవకుడు, మొలకెత్తే విత్తనమే విత్తనం, ప్రియంగా సంభాషించేదే భార్య, తండ్రినీ తల్లినీ, వృద్ధులైనా పూజించి పోషించేవాడే కొడుకు, గుణవంతునిగా ధర్మప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు. ఇలా కాని వాళ్ళు బతకడం భూమికి బరువు.
సాభార్యా యా గృహేదక్షా సాభార్యా యా ప్రియం వదా ।
సాభార్యా యా పతి ప్రాణా సా భార్యా యా పతివ్రతా ॥ (ఆచార... 108/18)
ఇలాంటి పతివ్రతయు, పైగా సుందరి, మంగళప్రదకార్యాలు చేయునది, ధర్మపరాయణ, శృంగార సుఖం కోసం కాకుండా పుత్ర సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకొనేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు.
అలాకాకుండా ఎగుడుదిగుడు కన్నులది, పాపిని, కలహప్రియ, పరపురుషులపై ఆసక్తి కలదియైన భార్యకు దొరికిపోయినవాడు ఎన్ని వున్నా, అన్నీ వున్నా దరిద్రుడే. ఇలాంటి వాడు పెళ్ళయిన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు.
దుష్టపత్ని, దుష్టమిత్రుడు, పొగరుబోతుభృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్క. వానికి సుఖం వుండదు. శాంతీ వుండదు.
దుష్టసాంగత్యాన్నొదిలేసి, మంచివారితో కలసిమెలసి తిరుగుతూ రాత్రింబవళ్ళు వీలైనంతవఱకు పుణ్యాన్నే సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్నీ మనయొక్క అనిత్యత్వాన్నీ తలుస్తూనే జీవించాలి.
వేశ్యాలంపటంలో పడరాదు. అల్పమైన చదువున్నవాడూ బలహీనుడూ మహాశక్తిశాలిగా రూపొందవచ్చు, పచ్చికృతఘ్నుడని ప్రజలంతా అనేవాడు కూడా మంచివాడై పోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు, అగ్ని చల్లగా కావచ్చు, మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు. కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు.
సూతుడిలా కొనసాగించాడు. నీతిసారాన్ని మునులకీయసాగాడు. ధనాన్ని సంపాదించాలి కాని, దాన్ని తనకూ, స్త్రీలకూ, పిల్లలకూ ఆపదవచ్చినపుడు వాడుకోవడానికి చాలినంతవఱకే దాచుకోవాలి.
No comments:
Post a Comment