Wednesday 28 August 2024

శ్రీ గరుడ పురాణము (277)

 


మనిషికి అనేక సహస్ర చింతలుంటాయి గానీ వాటిలో నాలుగు మాత్రం తీక్షమైన కత్తివాదరలాగా మనసును కోసివేస్తుంటాయి. అవి నీచుడిచే అవమానింపబడడం, ఆలి ఆకలి, అనురాగం లేని ఆలు, ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు. 


అనుకూలురైన కొడుకులు, ధనాన్ని సమకూర్చిపెడుతున్న విద్య, ఆరోగ్యం చెడని శరీరం, సత్సంగినీ మనోను కూలావశవర్తినీయైన భార్య ఈ పంచ భాగ్యాలూ పురుషుని దుఃఖాలన్నిటినీ దూరం చేస్తాయి.


లేడి, ఏనుగు, కీటకం, తుమ్మెద, చేప ఈ అయిదూ క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రసాలను ప్రమాదకరస్థాయిలో ఇష్టపడి సేవించి పీకలమీదికి తెచ్చుకుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా ఈ అయిదింటినీ ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞుడనని చెప్పుకునే మనిషి కూడా నష్టపోతుంటాడు.


కురంగమాతంగ పతంగ భృంగ 

మీనా హతాః పంచభిరేవ పంచ । 


ఏకః ప్రమాదీ స కథం నఘాత్యో 

యః సేవతే పంచభిరేవ పంచ ॥


(ఆచార 115/21)


బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైనా ఈ అయిదుపనులనూ చేయరాదు. అవి ఏవనగా ధైర్యాన్ని కోల్పోవడం, కటువుగా ధుమధుమలాడుతూ వుండడం, గమ్యం లేకుండా జీవించడం, మలిన వస్త్రాలనే ధరించడం, అనాహూతంగా అంటే ఎవరూ పిలవకపోయినా సంబరాలకూ పెళ్ళిళ్ళకూ పోవడం. ఈ పనులలో ఒక్కటి చేసినా బ్రాహ్మణునికి పూజించేవారూ, గౌరవించేవారూ మిగలరు.


ఆయువు, కర్మ, ధనం, విద్య, మృత్యువు ఈ పంచాంశాలూ మనం పుట్టినపుడే నిశ్చితమైపోతాయి. మనం చేయవలసినదల్లా వాటిని మెరుగుపరుచుకొని జీవించడమే. భగవంతుని దయవుంటే మృత్యువు అనాయాసం కావచ్చు. ఆయువు ఆరోగ్యమయం కావచ్చు.


ఆయుః కర్మ చ విత్తం చవిద్యా నిధనమేవచ |

పంచైతాని వివిచ్యంతే జాయమానస్య దేహినః ॥


(ఆచార ...115/23)


మబ్బునీడ, దుష్టుని ప్రేమ, పరనారితోడు, యౌవనం, ధనం - ఈ అయిదూ అస్థిరాలు. మనిషికి సంబంధించినవన్నీ, ధర్మకీర్తులు తప్ప, అస్థిరాలే.


అభ్రచ్ఛాయాఖలే ప్రీతిః పరనారీషుసంగతిః । 

పంచైతే హ్యాస్థిరాభావా యౌవనాని ధనానిచ ॥


అస్థిరం జీవితం లోకే అస్థిరం ధనయౌవనం |

అస్థిరం పుత్ర దారాద్యం ధర్మః కీర్తిర్యశః స్థిరం ॥


(ఆచార ..115/25,26)

No comments:

Post a Comment