ప్రాణియొక్క మృత్యువు ఆ మృత్యుకారణమున్న చోటే వుంటుంది. లక్ష్మి ఎక్కడుంటుంది? సంపదలున్నచోటే కదా! మన కర్మ చేత ప్రేరేపింపబడి మనమే ఆయా ఫలానున్న చోటికి వెళ్తాము. గోశాలలో ఎన్ని గోవులున్నా దూడ తన తల్లి వద్దకే పోయినట్లు ప్రపంచంలో ఇంతమంది వున్నా నీ పూర్వకర్మఫలం నిన్నే చేరుకుంటుంది.
తత్రమృత్యుర్యత్ర హంతా తత్ర శ్రీర్యత్ర సంపదః |
తత్ర తత్ర స్వయం యాతి ప్రేర్యమాణః స్వకర్మభిః ॥
భూతపూర్వం కృతం కర్మ కర్తార మనుతిష్ఠతి |
యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం ॥
(ఆచార ... 113/53,54)
మూర్ఖ ప్రాణులకు తెలియదు. చెప్పినా వినరు. తమకు కలిగిన దుఃఖాలకు కోపించి దేవుని నిందిస్తారు. మనుజులపై కక్ష పెట్టుకుంటారు. ఫలితంగా మరిన్ని పాపాలుచేసి వచ్చే జన్మలో కూడా ఇలాగే తగలడతారు. తన సుఖదుఃఖాలతో ప్రమేయం లేకుండా పుణ్యకార్యాలు చేసినవాడే ఇప్పుడు సుఖంగా బతుకుతున్నాడని తెలుసుకోవాలి.
ఇతరుల దోషాలను వెతికి పట్టుకోవడంలో గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ తనుచేసే తప్పులను మాత్రం కానుకోలేనివాడు గేదెలాంటివాడు.
నీచః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి ।
ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి ”
(ఆచార ... 113/57)
రాగద్వేషాల నంటి పెట్టుకొని బతికే జీవికి ఎక్కడా సుఖముండదు. సంతోషమున్న చోటనే సుఖముంటుంది. స్నేహమున్న చోట ఆ స్నేహమేమైపోతుందో, తను ప్రేమించిన వారి గతి ఏమిటోనని భయముంటుంది. ఇదే మమకారం. దీనిని విసర్జించినవాడే సుఖపడగలడు. ఈ శరీరమే సుఖదుఃఖాల నిలయం. అవి శరీరంతోనే పుడతాయి.
పరాధీనతయే దుఃఖం, స్వాధీనతయే సుఖం. మనిషికి సుఖదుఃఖాలు ఒకదాని వెంటనొకటి చక్రంలోని కర్రలలాగా వస్తూనే వుంటాయి; పోతూనే వుంటాయి. అనాసక్త భావంతో అన్ని పనులూ చేసుకొనే వాడొక్కడే నిత్యసుఖి.
సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం |
ఏ తద్విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః ।
సుఖస్యానంతరం దుఃఖం దుఃఖ స్యానంతరం సుఖం |
సుఖం దుఃఖం మనుష్యాణాం చక్రవత్ పరివర్తతే |
యద్గతింతదతిక్రాంతం యది స్యాత్ తచ్చదూరతః ।
వర్తమానేన వర్తేత నస శోకేన బాధ్యతే ॥
(ఆచార ...113/61-63)
No comments:
Post a Comment