మేధావీ, వాక్పటుత గలవాడూ, విద్వాంసుడూ, జితేంద్రియుడూ, సర్వశాస్త్ర పరిచయం మరియు విమర్శక దృష్టి ఉన్నవాడూ, స్వతహాగా సజ్జనుడూనగు వానిని లేఖకునిగా పెట్టుకోవాలి. బుద్ధిమంతునీ, వివేకశీలునీ, శూరునీ, పరేంగితజ్ఞునీ, మాటతీరు గలవానినీ, యథార్ధం చెప్పే ధైర్యమూ చెప్పడంలో నేర్పూగలవానినీ, దూతగా నియమించుకోవాలి. సమస్త స్మృతులూ శ్రుతులూ చదివిన పండితుడూ, శాస్త్రాలలో నిష్ణాతుడూ, శౌర్య పరాక్రమసంపన్నుడూ నగు వానిని ధర్మాధ్యక్ష పదవికి ఎన్నుకోవాలి.
వంటవాడు వంశపారంపర్యంగా రావాలి. పాకశాస్త్ర ప్రవీణుడై వుండాలి. నిజాయితీ, సత్యవాక్పరిపాలనా, పవిత్రతా, సామర్థ్యమూ గలవాడై వుండాలి. ఎన్ని అర్హతలున్నా దుర్జనుని ఏ పదవికీ తీసుకొనరాదు. అధికారాన్ని ఎవరి చేతిలోనూ పెట్టరాదు. (అధ్యాయం - 112)
నీతిసారం
రాజు తన భృత్యుల శీలం విషయంలో బాగా నిక్కచ్చిగా వుండాలి. ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి. పనిలో నిర్లక్ష్యం చూపిన వారిని కఠినంగా శిక్షించాలి.
సద్భిరా సీత సతతం సద్భిః కుర్వీత సంగతిం |
సద్భిర్వివాదం మైత్రీంచ నా సద్భిః కించి రాచరేత్ ॥
పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞః సత్యవాది భిః |
బంధనస్తోఽ పి తిష్టేశ్చ నతు రాజ్యేఖలైః సవా ॥
(ఆచార ... 113/2,3)
నిరంతరం మంచివారితోనే వుండాలి. వివాదం, మైత్రీ కూడా వారితోనే చేయాలి. మంచివారితో కలసి అడవులలోనైనా సుఖించవచ్చు గాని చెడ్డవారితో కలిస్తే రాజ్యభోగం కలుగుతుందన్నా అంగీకరించరాదు.
ఏ పనినీ సగంలో ఆపడం, విడువడం మంచిలక్షణం కాదు. పనిని సంపూర్ణంగా చేయగలిగితేనే ఒప్పుకోవాలి. చేసేదాకా అన్ని కర్మలూ ఆ పనివైపే సాగాలి. రాజులైనా ప్రజలైనా ఆశపోతూలూ, తొందరపాటు మనుష్యులూ కారాదు. పుట్ట, తేనెతుట్టె, చంద్రుని వెన్నెల ఎలాగైతే క్రమక్రమంగా పెరుగుతాయో స్థిరంగా నిలిచే సొమ్ము కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుందనే జ్ఞానాన్ని కలిగివుండాలి.
అర్జితస్య క్షయం దృష్ట్వా సంప్రదత్తస్య సంచయం |
అవంధ్యం దివసం కుర్యాద్దానాధ్యన కర్మసు ॥
(ఆచార ... 113/8)
దానం చేస్తే ధనం తరిగిపోతుందని, కష్టపడి ధనం సంపాదించి దానాలకీ, అధ్యయనాలకీ ఖర్చు పెట్టి వేస్తే మళ్ళా దరిద్రులమై పోతామని కొందరు భయపడుతుంటారు. గానీ దానం వల్ల, విద్య వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు. ఇంద్రియ నిగ్రహం గలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడుగాని అదిలేని వాడిని అడవిలో పడేసినా బాగుపడడు. ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్వికీ తీసిపోడు. వానికి ఇల్లే తపోవనం. కర్మే భగవంతుడు.
సత్యమును పాలించడమే ధర్మాన్ని రక్షించడం కూడా అవుతుంది. అభ్యాసం విద్యనీ, కడిగి తోమి కడుగుట పాత్రనీ, శీలం వ్యక్తి యొక్క వంశాన్నీ రక్షిస్తాయి.
సత్యేన రక్ష్యతే ధర్మో విద్యాయోగేన రక్ష్యతే ।
మృజయా రక్ష్యతే పాత్రం కులం శీలేన రక్ష్యతే ॥
(ఆచార ...113/10)
బంధువులనో ఆత్మీయులనో ధనం అడుక్కు తిని బతకడం కంటే నూతిలోపడి కాని, పాముల చేత కరిపించుకొని గాని చావడమే మేలు. దానికి ధైర్యం చాలకపోతే ఏ వింధ్యాటవిలోనో నివసించుట మంచిది.
సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు. పూర్వజన్మ పాపం వల్ల నశిస్తాయి. ఆర్జిత పుణ్యమున్న వాని సంపద వృద్ధి చెందుతుంది.
బ్రాహ్మణునికి విద్యా, పృథ్వికి రాజు, ఆకాశానికి చంద్రుడూ, సమస్త చరాచరాలకూ శీలమూ ఆభూషణాలు.
విప్రాణాం భూషణం విద్యా సృథివ్యా భూషణం నృపః |
నభసో భూషణం చంద్ర శీలం సర్వస్వ భూషణం ॥
(ఆచార ... 113/13)
No comments:
Post a Comment