రాజుకైనా ప్రజలకైనా ధనం అత్యంత ముఖ్యం. ధనవంతునికీ మిత్ర, బంధు, బాంధవులుంటారు. అతనినే మహాపురుషుడనీ, సమర్థుడనీ కొనియాడతారు. ధనం కోల్పోతే అదే వ్యక్తిని అందరూ వదిలేస్తారు. వాడసలు మగాడే కాడంటారు. మరల ధనం సంపాదించుకు వస్తే నాలికకరచుకొని అతని చుట్టూ చేరతారు.
యస్యార్ధాస్తస్యమిత్రాణి యస్యార్థా స్తస్య బాంధవాః ।
యస్యార్థాః స పుమాఁల్లోకే యస్యార్థాః సచపండితః ॥
త్యజంతి మిత్రాణి ధనైర్విహీనం పుత్రాశ్చ దారాశ్చ సుహృజ్జనాశ్చ |
తేచార్ధవంతం పునరాశ్రయంతి హ్యర్థోహి లోకే పురుషస్య బంధుః ॥
(ఆచార ... 111/17,18)
రాజుకి శాస్త్ర జ్ఞానముండాలి. అదొక కన్ను వంటిదైతే, మరొక కన్ను గూఢచారులు. ఏ రాజు యొక్క పుత్రులూ, భృత్యులూ, మంత్రులూ, పురోహితులూ, ఇంద్రియాలూ తమ తమ కర్తవ్య పాలనలో బద్దకం వహిస్తారో ఆ రాజు ఎంతో కాలం రాజుగా మనలేడు. వీరంతా సక్రమంగా పనిచేస్తే బలవంతుడైన రాజు ఎన్నేళ్ళయినా ఏలగలడు. ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఉన్నవానిని దేవతలు కూడా మెచ్చుకొని పై పదవికి పంపిస్తారు.
ఉద్యోగః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమంః |
షడ్విధో యస్య ఉత్సాహస్తస్య దేవోఽపి శంకతే ॥
ఉద్యోగేన కృతే కార్యే సిద్ధిర్యస్య న విద్యతే |
దైవం తస్య ప్రమాణం హి కర్తవ్యం పౌరుషం సదా ॥ (ఆధార... 111/32,33)
ఈ ఆరుగలవాడే పురుషుడు. ఈ జన్మలోని పౌరుషమే మరుజన్మలో భాగ్యమవుతుంది.
(అధ్యాయం - 111)
ఉత్తములనీ, మధ్యములనీ, అధములనీ భృత్యులలో మూడు రకాల వారుంటారు. అది పరీక్షను పెట్టి తేల్చుకోవాలి.
బంగారాన్ని ఎలాగైతే అత్యంత జాగరూకతతో ఘర్షణ, ఛేదన, తాపన, తాడన పరీక్షలను పెట్టి తీసుకుంటామో భృత్యులను రాజు కూడా అలాగే ఎంచుకోవాలి.
వర్ణము, వ్రత, శీల, కర్మములు ఈ ఎంపికలో ప్రధాన పాత్రనువహిస్తాయి. ముఖ్యంగా కోశాధికారిని ఎంచుకొనేటపుడు అభ్యర్థి యొక్క వంశాన్నీ, శీల సద్గుణసంపన్నతలనూ, సత్య ధర్మపరాయణత్వాన్నీ, రూప సంపదనూ, ప్రసన్న చిత్తాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. రత్నాల గూర్చి బాగా తెలిసిన వానినే రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి. బలపరాక్రమాలే కాక మంచి యుద్ధవ్యూహరచనాదక్షుని సేనాధ్యక్షునిగా నియమించుకోవాలి. సంకేతమాత్రమున స్వామి అవసరాన్ని పోల్చుకోగలిగేవాడూ, బలవంతుడూ, సుందర శరీరుడూ, పని బద్ధకంలేనివాడూ, జితేద్రియుడూ అయిన వానిని ప్రతీహారిగా పెట్టుకోవాలి.
No comments:
Post a Comment