కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణియైన స్త్రీకి ప్రేమ వుండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికీ సుఖమూ వుండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా! నమ్మకం లేని చోట సుఖమెట్లా వుంటుంది? ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టశాసనాలనే ప్రజలపై రుద్దుతూ పోతుంటారు కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ పాతికశాతం మందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడ. మిగతావాళ్ళు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువమంది ఇతరులపై ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్నభుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది.
పరాన్నంచ పరస్వంచ పరశయ్యాః పరస్త్రీయః |
పరవేశ్మని వాసశ్చ శక్రాదపి హరే చ్ఛ్రియం ॥
(ఆచార .... 115/5)
ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరినుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్యం మాట్లాడుతూ, శరీరాన్ని తగులుతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై, శయ్యపై మెలగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారెవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసివస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడు గానీ ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములై పోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి.
స్త్రియో నశ్యంతిరూపేణ తపః క్రోధేన నశ్యతి |
గావో దూర ప్రచారేణ శూద్రా న్నేన ద్విజోత్తమః |
(ఆచార ... 115/7)
అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూర ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, *శూద్రాన్నంవల్ల ఎంతటి ద్విజోత్తములైనా
దిగజారిపోతారు.
*ఇక్కడ శూద్రాన్నం అంటే ఏ వెనుకబడిన కులంవారో, ఇప్పటి భాషలో, వండిపెట్టిన అన్నం కాదు. అది మూర్ఖపుటాలోచన, మడీ, తడీ, శుచీ శుభ్రతా లేని అన్నమే అప్పటి భాషలో శూద్రాన్నము. గొడ్డుకారము, గుప్పెడు ఉప్పు కలిసినది శూద్రాన్నము. నీచుతో నిండినది శూద్రాన్నము. అలాగే ద్విజులనగా బ్రాహ్మణులు మాత్రమే కారు. ఇలా ఎందుకు చెప్పవలసివస్తుందంటే ఈ 'శూద్ర' శబ్దాన్ని చూపించి పరదేశీయులు, వారి మానసపుత్రులు కపట వ్యూహరచన చేసి ఒక పథకం ప్రకారం గ్రంథాలు వ్రాసి, ఉపన్యాసాలిస్తూ ఇప్పటికే ఈ సమాజాన్ని విడగొట్టేయడంలో చాలావరకు విజయం సాధించారు.
పిల్లల, శిష్యులపట్ల బాధ్యతకు బదులుగా అతి గారాబం, స్వార్థం చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల, గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశా నిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువ కాలం ఎండలో వుండడం వల్ల చివికిపోతాయి.
No comments:
Post a Comment