అధికారంలో వున్నవాడికైతే సాయపడడానికి ఆపరిచిత వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు. చిటికెలో మిత్రులయి పోతారు. అదే వ్యక్తి పదవీచుత్యుడైతే, అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు. స్వంతవారే శత్రువులా చూస్తారు. (తరువాత తెలుగులో వచ్చిన అధికారాంతమునందు చూడవలెరా ఆయయ్య సౌభాగ్యముల్ అనే సుభాషితానికి గరుడపురాణమే మూలం కావచ్చు.)
నిజమైన మిత్రుడెవరో ఆపదవచ్చినపుడే తెలుస్తుంది. అలాగే యుద్ధంలో వీరత్వమూ, ఏకాంతంలో శుచితా, వైభవం క్షీణించినపుడు పత్నీ, దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి. అనగా వారి అసలు రంగులు బైట పడతాయి.
వృక్షం క్షీణఫలం త్యజంతి విహగాః
శుష్కం సరః సారసా నిర్ద్రవ్యం
పురుషంత్యజంతి గణికా భ్రష్టం నృపం మంత్రిణః ।
పుష్పం పర్యుషితం త్యజంతి మధుపాః
దగ్ధం వనాంతం మృగాః సర్వః కార్యవశా
జ్జనోహరమతే కస్యాస్తి కో వల్లభః ॥
(ఆచార...109/9)
ఎవరికి యెవరు? చివరికి యెవరు? పళ్ళ కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేని ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా! ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు.
లుబ్ధమర్ధ ప్రదానేన శ్లాఘ్యమంజలి కర్మణా।
మూర్ఖం ఛందాను వృత్త్వా చ యాథాత థ్యేన పందితం ॥
సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః।
ఇతరేఖాధ్యపానేన మానదానేన పండితాః ॥
(ఆచార... 109/10,11)
లోభికి ఏదో రూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు. ఆ రకంగా వాడి మనసును గెలుచుకోవచ్చును. అలాగే అంజలించి ఉదారచిత్తులనూ, పొగడ్తలతో మూర్ఖులనూ, తాత్త్వికచర్చ ద్వారా విద్వాంసులనూ, మంచి మనసు చేత, ఉన్నతాలోచనల చేత దేవతలనూ సజ్జనులనూ ద్విజులనూ మన్చి చేసుకోవచ్చును. అన్నపానాలతో సామాన్యులనూ, మాన సమ్మానాలతో పండితులనూ ఆకట్టుకోగలము.
No comments:
Post a Comment