Friday, 23 August 2024

శ్రీ గరుడ పురాణము (273)

 


పాలీయని, చూలు కట్టని ఆవు, విద్వాంసుడు, ధార్మికుడు కాని కొడుకు ఉండి మాత్రం లాభమేమి? చంద్రుడొక్కడే అయినా ఆకాశమంతా వెలుగొందునట్లు మహా పురుషుడైన కొడుకు వల్ల వంశమంతా వన్నెకెక్కుతుంది. తారలెన్ని వున్నా చంద్రుడే శోభస్కరుడు కుపుత్రులు వందమంది కంటె గుణవంతుడైన ఒక్క కొడుకే మేలు, చాలు.


ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన ధీమతా । 

కులం పురుష సింహేన చంద్రేణ గగనం యథా ॥

ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధితా | 

వనంసువాసితం సర్వం సుపుత్రేణ కులం యథా ॥

ఏకోహి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం !

చంద్రోహంతి తమాం స్యే కో నచ జ్యోతిః సహస్రకం ॥ (ఆచార...114/59)


పిల్లలను అయిదేళ్ళ వయసొచ్చేదాకా ప్రేమ కురిపిస్తూ పెంచాలి. అక్కడి నుండి పదేళ్ళు వచ్చేదాకా అవసరమైతే దండించియైనా క్రమశిక్షణ నేర్పాలి. పదారేళ్ళదాకా విద్యాబుద్ధులు నేర్పి ఆ తరువాత వారిని మిత్రుల వలె సంభావించాలి.


కొందరి ముఖాలు పులిముఖాల వలెనున్నా వారు సాత్త్వికులు కావచ్చు. కొందరి ముఖాలు లేడి ముఖాల వలె అమాయకంగా వున్నా వారు క్రూరులూ కావచ్చు. అందుచేత పైపై చూపులతో ఎవరినీ విశ్వసించరాదు.


క్షమించే లక్షణం వున్నవారిలో అది దోషం కూడా కావచ్చు. ఎందుకంటే జనులు వారు అసమర్థులనుకుంటారు.


ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోప పద్యతే । 

యదేశం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః ॥


ఈ ప్రపంచంలోని భోగాలన్నీ క్షణభంగురాలేనని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. కాబట్టి అనుభవించవచ్చు గాని ఆరాటపడరాదు. విద్వాంసుడెపుడూ ఆకర్షణకు లోను కాడు. అన్న పితృసమానుడే. నాన్న చనిపోతే ఆ కుటుంబానికి అన్నే దిక్కవుతాడు.


తమ్ముళ్ళందరినీ పైకి తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళునిలబడేలా చేసే అన్న నాన్నే కాదు దేవుడితోసమానుడవుతాడు. కాబట్టి అన్నను దేవునివలె చూసుకొనేవాడే నిజమైన మనిషి. తక్కువ బలం కలవారిని తక్కువగా చూడకూడదు. వారు ఒక బృందంగా ఏర్పడితే ఏమైనా చేయగలరు. గడ్డి పరకలతో నేసిన తాడు ఏనుగునే బంధించగలుగుతున్నది కదా!


ఒకరిని దోచి ఇంకొకరికి దానం చేయువానికి ఆ దానం సద్గతి నివ్వదు. దోపిడీలు చేసిన పాపానికి వాడు నిస్సందేహంగా నరకానికే పోతాడు. దేవతల, బ్రాహ్మణుల ధనాన్ని అపహరించినా, వారిని తిరస్కారంగా చూసినా వంశం వృద్ధికాదు. బ్రహ్మహత్య, మద్యపానం వంటి మహాపాతకాలకు కూడా ప్రాయశ్చిత్తముంది కాని సజ్జనుల వద్ద ఉపకారాన్ని పొంది వారికే కీడు చేసే కృతఘ్నులకు నిష్కృతి లేదు.

No comments:

Post a Comment