ఇతిహాస ప్రసిద్ధులు ధర్మవీరులునైన రాజపుత్రులు ధర్మజాది పంచపాండవులు. వీరంతా చంద్రసమాన కాంతిమంతులు, సాటిలేని పరాక్రమ శీలురు, సూర్యప్రతాపులు. పైగా స్వయంగా విష్ణువేయైన శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టులు. అయినా అంతటి వారు భిక్షాటన చేసుకున్నారే గాని ధర్మాన్ని తప్పలేదు, కర్మాన్ని వదులుకోలేదు. ఇదీ శీలమంటే, దుష్టగ్రహాలెంత బాధించినా ధర్మాన్ని త్యజించరాదు.
ధర్మానికి లోబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే శ్రమకోర్చి సృష్టి, స్థితి లయలను క్రమం తప్పకుండా చేస్తూ, వారి కర్మను వారు సంపన్నం చేస్తున్నారు. మనమంతా ఆ కర్మకు కూడా నమస్కరించి కర్మాధీనులమై జీవించవలసినదే.
బ్రహ్మాయేన కులాలవన్నియ మితో
బ్రహ్మాండ భాండోదరే
విష్ణుర్యేన దశావతారగహనే
క్షిప్తో మహాసంకటే |
రుద్రోయేన కపాల పాణి పుటకే
భిక్షాటనం కారితః
సూర్యోభ్రామ్యతి నిత్యమేవ
గగనే తస్మై నమః కర్మణే ॥
(ఆచార ... 113/15)
దానం, దానివల్ల కలిగే కష్టసుఖాలూ కూడా కర్మాధీనాలే, విష్ణువంతటివాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు. అంతవరకూ ముల్లోకాలనూ ఏకచ్ఛత్రాధిపత్యంగా యేలిన బలిచక్రవర్తి మూడడుగుల దానమిచ్చి ముల్లోకాలనూ కోల్పోయాడు. ఇదంతా భగవంతుని క్రీడ. ఆడించేవానికి సమస్కారము.
దాతా బలి ర్యాచకకో మురారిద్దానం మహీం
విప్రముఖస్య మధ్యే
దత్త్వాఫలం బంధనమేవ లబ్ధం నమోఽ స్తుతే
దైవయ థేష్టకారిణే
(ఆచార... 113/16)
పాపానికి శిక్ష తప్పదు. ఈ శిక్ష, పాపి యొక్క పాపాన్నే తప్ప వంశప్రతిష్టనూ చూడదు, తల్లిదండ్రులనూ చూసి భయపడదు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుల సంతానమైనా పాపం చేస్తే దండన తప్పదు. (మన్మథుడు దండింపబడినాడు కదా!)
కొంతమంది 'నేను ఏ పాపమూ చేయలేదు. అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు! అనీ 'మా వూరి పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కేలేదు. అయినా వాడు తెగ సుఖపడిపోతున్నాడు. దేవుడేం చేస్తున్నాడో మరి' అనీ వాపోతారు. పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతోంది.
త్రికూట పర్వతం పెట్టనికోటై, సముద్రమే పరిఖగా వుండి, రాక్షసగణంచే రక్షితుడై, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడై, స్వయంగా విశుద్ధాచరణా కోటిలింగార్చనా సముపేతుడై, అద్భుత తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలసి రాకపోవడంతో కూలిపోయాడు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది?
No comments:
Post a Comment