విద్యార్జన, ధనసంగ్రహం, పర్వతారోహణం, అభీష్టసిద్ధి, ధర్మాచరణం - ఈ అయిదింటినీ ఓపికగా క్రమక్రమంగా సాధించుకోవలసి వుంటుంది.
దేవపూజనాదిక కర్మలూ, బ్రాహ్మణులకిచ్చే దానమూ, సద్విద్య మంచిమిత్రుడూ ఇవి మానవునికి జీవిత పర్యంతమూ సహాయకారులవుతాయి. బాల్యకాలంలో విద్యనీ, యువావస్థలో ధనాన్నీ అనుకూలవతియైన పత్నినీ సంపాదించుకోలేని వారు సుఖవంతమైన జీవితాన్ని గడపలేరు.
విద్యార్జన ఒక ఉపాసన. ఆ ఉపాసనా కాలంలో మనిషికి భోజనాన్ని గురించిన ఆలోచనరాకూడదు. విద్య కోసం, అవసరమైతే, గరుత్మంతుని వలె, ఎంత దూరమైనా పోవాలి. వీలైనంత వేగంగా పోవాలి.
శుష్కతర్కం వల్ల ఎవరికీ ప్రయోజనముండదు. సిద్ధాంత స్థాపనము కేవలం తర్కమాత్రాన జరగదు. ధర్మం కూడా తర్కము ననుసరించి వుండదు. పరిస్థితులను బట్టి ధర్మం మహర్షులచే ఆదేశింపబడుతుంది.
తర్కేఽ ప్రతిష్ఠాశ్రుతయో
విభిన్నాః నాసావృషిర్యస్య మతం న భిన్నం ।
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనోయేన గతః సపంథాః ॥
(ఆచార...109/52)
ఆకారం, సంకేతం, గతి, చేష్ట, మాట, కనులు, ముఖము - మనిషి యొక్క అంతః కరణ వీటి ద్వారా బయటపడిపోతూనే వుంటుంది. వీటిని బట్టి అవతలివాని అసలు రంగుని కనుగొని అవగతం చేసుకోగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. జంతువులలో గుఱ్ఱానికీ, ఏనుగుకీ ఈ శక్తి కొంత వఱకూ వుంటుంది." (అధ్యాయాలు (అధ్యాయలు - 108, 109)
నీతిసారం
సూతుడు శౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పాడు, “మహామునులారా! సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలను సేవించేవాడు రెండింటికీ చెడతాడు.
వాగ్వైభవం లేని వ్యక్తి యొక్క విద్య, పిరికివాని చేతిలోని ఆయుధంవలెనే వానికి పనికిరాదు. అంధుని భార్య యొక్క అందమూ అంతే.
సుందర భోజ్య పదార్థాల కలిమీ, వాటిని అరిగించుకొనే శక్తీ, రూపవతియగు భార్యా, ఆమెను అన్ని విధాలా సంతృప్తి పఱచగలిగే శక్తీ, ధనమూ, వైభవమూ, దానం చేసే బుద్దీ - ఇవన్నీ గొప్ప తపస్సును చేసిన వారికే లభిస్తాయి.
వేదానికి ఫలం అగ్నిహోత్రం; విద్య యొక్క ఫలాలు శీలమూ, సదాచారము; స్త్రీ వల్ల లాభం రత్యానందం, పుత్రప్రాప్తి; అలాగే ధనం వుండేది దానానికీ, భోగానికీ.
ధనం ఉండాలి కానీ అనర్ధాన్ని తెచ్చి పెట్టే ధనం అభిలషణీయం కాదు. మణిని కోరుకోవచ్చు. కాని పాముపడగపై నున్న మణి కోసం పాకులాడకూడదు కదా!
అగ్నిహోత్రం కోసం హవిష్యాన్నాన్ని తక్కువ స్థాయి వాని వద్ద నుండి కూడా గ్రహించవచ్చు. బాలకుని వద్ద నుండైనా సుభాషితాన్ని ఆలకించి ఆదరించాలి. స్వర్ణము అపవిత్ర స్థానంలో వున్నా చేజిక్కించుకోవచ్చు. అలాగే నీచవ్యక్తి వద్ద శ్రేష్ఠ విద్య వుంటే నిస్సంకోచంగా ఆ విద్యను నేర్చుకోవచ్చు.
రాజుతో స్నేహం మంచిదికాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబము యజ్ఞయాగాదులు చేసైనా పుత్ర సంతానాన్ని పొందవలసి వుంటుంది.
No comments:
Post a Comment